రిలయన్స్ బ్యాంకులో సుమితొమోకు 10% వాటా!

29 Dec, 2014 00:26 IST|Sakshi
రిలయన్స్ బ్యాంకులో సుమితొమోకు 10% వాటా!

న్యూఢిల్లీ: ప్రతిపాదిత రిలయన్స్ బ్యాంకులో జపాన్ ఆర్థిక సేవల దిగ్గజం సుమితొమో మిత్సుయ్ ట్రస్ట్ బ్యాంక్ ఆఫ్ జపాన్(ఎస్‌ఎంటీబీ)కు 10 శాతం వాటా ఇవ్వాలని రిలయన్స్ క్యాపిటల్ భావిస్తోంది. యూనివర్సల్ బ్యాంకింగ్ లెనైన్స్‌కు దరఖాస్తు చేసేందుకు ఉత్సాహంగా ఉన్న అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్(అడాగ్).... ఆర్‌బీఐ తుది మార్గదర్శకాల విడుదల కోసం వేచిచూస్తోంది. ఇటీవలే అడాగ్ గ్రూప్ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్.. ఎస్‌ఎంటీబీతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా రూ.371 కోట్ల పెట్టుబడితో ఎస్‌ఎంటీబీ రిలయన్స్ క్యాపిటల్‌లో 2.77 శాతం వాటాను తీసుకుంది. తద్వారా దీర్ఘకాలంలో విభిన్న వ్యాపారాల్లో ఎస్‌ఎంటీబీని భాగస్వామిగా చేసుకోవాలనేది అడాగ్ ప్రణాళిక. కాగా, మరో జపాన్ భాగస్వామ్య సంస్థ నిప్పన్ లైఫ్‌కు కూడా ప్రతిపాదిత బ్యాంకింగ్ వెంచర్‌లో 10 శాతం వాటాను ఇచ్చేందుకు రిలయన్స్ క్యాపిటల్ సుముఖంగా ఉంది.

నిప్పన్ లైఫ్ వాటా 49 శాతానికి...!
బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేయడంతో.. అడాగ్ గ్రూప్ జోరు పెంచుతోంది.  రిలయన్స్ క్యాపిటల్‌కు చెందిన రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో నిప్పన్ లైఫ్‌కు మరింత వాటా ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

నిప్పన్ లైఫ్‌కు  ప్రస్తుతం 26 శాతం వాటా ఉండగా... దీన్ని 49 శాతానికి పెంచుకునే అంశంపై ప్రాథమికంగా చర్చలు జరిపినట్లు రిలయన్స్ క్యాప్ సీఈఓ శ్యామ్ ఘోష్ చెప్పారు. అదేవిధంగా హెల్త్, జనరల్ ఇన్సూరెన్స్ వ్యాపారాల్లో కూడా విదేశీ కంపెనీలకు వాటాలు ఇచ్చే అంశంపై చర్చలు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు