సన్‌ ఫార్మా లాభం 7% అప్‌

26 May, 2018 00:18 IST|Sakshi

ఒక్కో షేరుకు రూ.2 డివిడెండ్‌

న్యూఢిల్లీ:  ఔషధ రంగ దిగ్గజం సన్‌ ఫార్మా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 1,309 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన రూ.1,224 కోట్లతో పోలిస్తే 7 శాతం అధికం. క్యూ4లో ఆదాయం రూ.7,137 కోట్ల నుంచి రూ. 6,977 కోట్లకు తగ్గింది.

అమెరికా మార్కెట్లో అమ్మకాలు దెబ్బతిన్నా... భారత్‌ సహా వర్ధమాన దేశాల్లో ఆదాయాలు మెరుగుపడటంతో లాభాల్లో వృద్ధి సాధించగలిగినట్లు సన్‌ ఫార్మా తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను నికర లాభం 69 శాతం క్షీణించి రూ.6,964 కోట్లకు తగ్గగా, ఆదాయం సైతం రూ. 31,578 కోట్ల నుంచి రూ. 26,489 కోట్లకు క్షీణించింది.

పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.1 ముఖవిలువ గల షేరు ఒక్కింటిపై రూ.2 చొప్పున డివిడెండ్‌ చెల్లించాలని బోర్డు తీర్మానించింది. సెప్టెంబర్‌ ఆఖరు వారంలో దీన్ని చెల్లించనున్నట్లు సంస్థ తెలిపింది. అమెరికాలో జనరిక్‌ ఔషధాలకు సంబంధించి ధరలపరమైన ఒత్తిళ్లు నెలకొన్నప్పటికీ, గడిచిన నాలుగు త్రైమాసికాల్లో క్రమంగా పనితీరు మెరుగుపర్చుకుంటూ వస్తున్నామని సన్‌ ఫార్మా ఎండీ దిలీప్‌ సంఘ్వి తెలిపారు.  శుక్రవారం సన్‌ ఫార్మా షేర్లు బీఎస్‌ఈలో 0.97 శాతం పెరిగి రూ. 466.55 వద్ద క్లోజయ్యాయి.  

మరిన్ని వార్తలు