సన్‌ ఫార్మా లాభం 59 శాతం డౌన్‌

15 Nov, 2017 00:47 IST|Sakshi

దెబ్బకొట్టిన అమెరికా అమ్మకాలు  

20 శాతం తగ్గిన ఆదాయం

సన్‌ఫార్మా ఎండీ దిలిప్‌ సంఘ్వి వెల్లడి

న్యూఢిల్లీ: దేశీయ అతి పెద్ద ఫార్మా కంపెనీ, సన్‌ ఫార్మా నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 59 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.2,235 కోట్లుగా ఉన్న కంపెనీ నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ2లో రూ.912 కోట్లకు తగ్గిందని సన్‌ ఫార్మా తెలిపింది.

ధరల ఒత్తిడి కారణంగా అమెరికా జనరిక్‌ మార్కెట్లో అమ్మకాలు క్షీణించడంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని సన్‌ ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌ ఎండీ, దిలిప్‌ సంఘ్వి చెప్పారు.  ఆదాయం రూ.8,260 కోట్ల నుంచి 20 శాతం తగ్గి రూ.6,650 కోట్లకు చేరిందని వివరించారు. మొత్తం వ్యయాలు 6 శాతం పెరిగి రూ.579 కోట్లకు చేరాయని వివరించారు.  

మెల్లమెల్లగా పుంజుకుంటాం...
అమెరికా జనరిక్స్‌ మార్కెట్లో ధరల ఒత్తిడి, స్పెషాల్టీ బిజినెస్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు విస్తరిస్తుండడడం ఈ క్యూ2 పనితీరుపై ప్రభావం చూపించాయని సంఘ్వి చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో పనితీరు మెల్లమెల్లగా పుంజుకోగలదన్న అంచనాలున్నాయని చెప్పారు.

భారత్‌లో బ్రాండెడ్‌ ఫార్ములేషన్స్‌ అమ్మకాలు 11 శాతం వృద్ధితో రూ.2,221 కోట్లకు పెరిగాయని. మొత్తం అమ్మకాల్లో ఈ వ్యాపార విభాగం వాటా 34 శాతమని వివరించారు. అమెరికా అమ్మకాలు 44 శాతం క్షీణించి 31కోట్ల డాలర్లకు తగ్గాయని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అమ్మకాలు 16 శాతం వృద్ధితో 20 కోట్ల డాలర్లకు పెరిగాయని వివరించారు.  

మిశ్రమంగా ఫలితాలు  
సన్‌ ఫార్మా ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఈ కంపెనీ రూ.6,861 కోట్ల ఆదాయంపై రూ.802 కోట్ల నికర లాభం ఆర్జించగలదన్న అంచనాలున్నాయి. నికర లాభం అంచనాలను మించగా, ఆదాయం అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో బీఎస్‌ఈలో సన్‌ ఫార్మా షేర్‌ 1.1 శాతం నష్టపోయి రూ.526 వద్ద ముగిసింది.  

>
మరిన్ని వార్తలు