సన్ ఫార్మా లాభం 3 రెట్లు అప్

13 Aug, 2016 01:21 IST|Sakshi
సన్ ఫార్మా లాభం 3 రెట్లు అప్

న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం  సన్ ఫార్మా నికర లాభం(కన్సాలిడేటెడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి మూడు రెట్లు పెరిగింది. గత క్యూ1లో రూ.556 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో 266 శాతం వృద్ధితో రూ.2,034 కోట్లకు పెరిగిందని సన్ ఫార్మా తెలిపింది. పన్ను వ్యయాలు బాగా పెరిగినప్పటికీ, ఆదాయం, నిర్వహణ పనితీరు మెరుగుపడడం వల్ల నికర లాభంలో ఈ స్థాయి వృద్ధి సాధించామని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.6,761 కోట్ల నుంచి 22 శాతం వృద్ధితో రూ.8,243 కోట్లకు పెరిగిందని వివరించింది.

నిర్వహణ లాభం(ఇబిటా) 65 శాతం వృద్ధితో రూ.2,921 కోట్లకు పెరిగిందని, మార్జిన్ 930 బేసిస్ పాయింట్లు పెరిగి 35.4 శాతానికి పెరిగాయని తెలిపింది. పన్ను వ్యయాలు రూ.113 కోట్ల నుంచి మూడు రెట్ల వృద్ధితో రూ.353 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఆర్థిక ఫలితాలు బాగా ఉన్నప్పటికీ, బీఎస్‌ఈలో సన్ ఫార్మా షేర్ 1 శాతం వరకూ నష్టపోయి రూ.802 వద్ద ముగిసింది.

 

 

మరిన్ని వార్తలు