సన్‌ ఫార్మా లాభం రూ.1,387 కోట్లు

14 Aug, 2019 11:45 IST|Sakshi

మొత్తం ఆదాయం రూ.8,374 కోట్లు

న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం, సన్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఇండస్ట్రీస్‌ ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో రూ.1,387 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ1లో రూ.1,057 కోట్ల నికర లాభం ఆర్జించామని సన్‌ ఫార్మా తెలిపింది. మొత్తం ఆదాయం గత క్యూ1లో రూ.7,224 కోట్లు, ఈ క్యూ1లో రూ.8,374 కోట్లుగా నమోదయ్యాయని సన్‌ ఫార్మా ఎమ్‌డీ దిలిప్‌ సంఘ్వి తెలిపారు. జపాన్‌కు చెందిన పోలా ఫార్మా కంపెనీ ఈ ఏడాది జనవరి 1 నుంచి తమ అనుబంధ కంపెనీగా మారిందని, అందుకే గత క్యూ1, ఈ క్యూ1 ఫలితాలను పోల్చడానికి లేదని వివరించారు. 

ఆర్‌ అండ్‌ డీ పెట్టుబడులు రూ.422 కోట్లు ...
పరిశోధన, అభివృద్ధి పెట్టుబడులు ఈ క్యూ1లో రూ.422 కోట్లని దిలీప్‌ సంఘ్వి తెలిపారు. ఇది మొత్తం అమ్మకాల్లో 5 శాతమని పేర్కొన్నారు. ఈ పెట్టుబడులు గత క్యూ1లో రూ.500 కోట్లని, మొత్తం అమ్మకాల్లో 7 శాతమని వివరించారు. అన్ని మార్కెట్లలో మంచి వృద్ధి సాధించామని, పూర్తి ఆర్థిక సంవత్సరం అంచనాలకు అనుగుణంగానే తమ పనితీరు ఉందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది క్లినికల్‌ ట్రయల్స్‌లోకి ప్రవేశిస్తున్నామని చెప్పారు. దీనికి సంబంధించిన మోలిక్యూల్స్‌ పరిశోధనలో ప్రోత్సాహకరమైన ఫలితాలు వస్తున్నాయని వివరించారు. 

అగ్రస్థానంలో సన్‌ ఫార్మా....  
ఈ క్యూ1లో భారత బ్రాండెడ్‌ ఫార్ములేషన్స్‌ వ్యాపారం 8 శాతం వృద్ధితో రూ.2,314 కోట్లకు పెరిగిందని దిలీప్‌ సంఘ్వి తెలిపారు. మొత్తం అమ్మకాల్లో వీటి వాటా 28 శాతమని పేర్కొన్నారు. మొత్తం అమ్మకాల్లో 36 శాతం వాటా ఉన్న అమెరికా అమ్మకాలు 12 శాతం వృద్ధితో 42 కోట్ల డాలర్లకు పెరిగిందని వివరించారు. మరో అనుబంధ సంస్థ టారో నికర అమ్మకాలు 4 శాతం వృద్ధితో 16 కోట్ల డాలర్లకు పెరగ్గా, నికర లాభం మాత్రం స్వల్పంగా తగ్గి 6.6 కోట్ల డాలర్లకు చేరిందని పేర్కొన్నారు. వృద్ధి చెందుతున్న మార్కెట్లలో అమ్మకాలు 19 కోట్ల డాలర్లుగా ఉన్నాయని, ఎలాంటి వృద్ధి లేదని వివరించారు. రూ.1,32,000 కోట్ల భారత ఫార్మా మార్కెట్లో 8.2 శాతం వాటాతో సన్‌ ఫార్మాదే అగ్రస్థానమని ఏఐఓసీడీ అవాక్స్‌ జూన్‌–2019 నివేదిక వెల్లడించిందని దిలిప్‌ సంఘ్వి పేర్కొన్నారు. 

స్టాక్‌ మార్కెట్‌భారీగా పతనమైనా,సన్‌ ఫార్మా మాత్రం లాభపడింది. క్యూ1 ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో బీఎస్‌ఈలో సన్‌ ఫార్మా షేర్‌ 3.7 శతం లాభంతో రూ.438 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో లాభపడిన రెండే షేర్లలో ఇది కూడా ఒకటి.

మరిన్ని వార్తలు