సన్‌ ఫార్మా లాభం రూ.1,064 కోట్లు

8 Nov, 2019 05:47 IST|Sakshi

గత క్యూ2లో రూ. 270 కోట్ల నష్టాలు

న్యూఢిల్లీ: సన్‌ ఫార్మాస్యూటికల్స్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ1,064 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.270 కోట్ల నికర నష్టాలు వచ్చాయని సన్‌ఫార్మా తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.6,938 కోట్ల నుంచి రూ.8,123 కోట్లకు ఎగసిందని పేర్కొంది.  

స్పెషాల్టీ వ్యాపారంలో పురోగతి...: వ్యయాల ఆదా, సామర్థ్యాల మెరుగుదలపై దృష్టి సారించడం కొనసాగిస్తున్నామని సన్‌ ఫార్మా ఎమ్‌డీ దిలీప్‌ సంఘ్వి పేర్కొన్నారు. మారుతున్న పరిశ్రమ తీరు తెన్నులకు అనుగుణంగా జనరిక్‌ వ్యాపారంలో కూడా మార్పులు, చేర్పులు చేస్తున్నామని వివరించారు. గ్లోబల్‌ స్పెషాల్టీ వ్యాపారంలో కూడా మంచి పురోగతి సాధిస్తున్నామన్నారు.

35% పెరిగిన భారత అమ్మకాలు..
భారత్‌ అమ్మకాలు 35% వృద్ధితో రూ.2,515 కోట్లకు చేరగా, అమెరికా విక్రయాల్లో పెద్దగా పురోగతి లేదన్నారు. వర్థమాన దేశాల్లో అమ్మకాలు 3% వృద్ధితో 20 కోట్ల డాలర్లకు, మిగిలిన దేశాల్లో విక్రయాలు 49% వృద్ధితో 16 కోట్ల డాలర్లకు పెరిగాయి.

రూ.1,616 కోట్ల నిర్వహణ లాభం....
పరిశోధన, అభివృద్ధిపై ఈ క్యూ2లో రూ.488 కోట్లు పెట్టుబడులు పెట్టింది. ఇది అమ్మకాల్లో 6 శాతానికి సమానం. నిర్వహణ లాభం 22 శాతం వృద్ధితో రూ.1,616 కోట్లకు పెరిగింది. నిర్వహణ మార్జిన్‌ మాత్రం 21 శాతం నుంచి 20 శాతానికి తగ్గింది.
నికర లాభం రూ.వెయ్యి కోట్లకు పైగా రావడంతో బీఎస్‌ఈలో సన్‌ ఫార్మా షేర్‌ 3 శాతం లాభంతో రూ.440 వద్ద ముగిసింది.

>
మరిన్ని వార్తలు