సన్ ఫార్మా లాభం 15 శాతం ప్లస్

14 Nov, 2014 02:00 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీ ఫార్మా దిగ్గజం సన్ ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్(క్యూ2) కాలానికి రూ. 1,572 కోట్ల నికర లాభాన్ని  ప్రకటించింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 1,362 కోట్లతో పోలిస్తే ఇది 15% అధికం. ఇదే కాలానికి నికర అమ్మకాలు కూడా 13% పుంజుకుని రూ. 4,751 కోట్లకు చేరాయి. అంచనాలకు అనుగుణంగా గరిష్ట స్థాయిలో లాభదాయకతను సాధించగలిగినట్లు కంపెనీ ఎండీ దిలీప్ సంఘ్వి పేర్కొన్నారు.

 దేశీయంగా బ్రాండెడ్ జనరిక్స్ అమ్మకాలు 21% ఎగసి రూ. 1,152 కోట్లను తాకగా, యూఎస్‌లో ఫినిష్డ్ డోసేజ్ విక్రయాలు 15% పెరిగి 48.1 కోట్ల డాలర్లకు చేరినట్లు కంపెనీ తెలిపింది. ఇందుకు టారో పనితీరు దోహదపడినట్లు వెల్లడించింది. కాగా, పరిశోధన, అభివృద్ధి విభాగంపై దాదాపు 7% అధికంగా రూ. 312 కోట్లను వెచ్చించినట్లు వివరించింది. సమీక్షా కాలంలో మెర్క్‌అండ్ కంపెనీతో టిల్డ్రాకిజుమాబ్ ఔషధానికి సంబంధించి ప్రపంచవ్యాప్త ప్రత్యేక లెసైన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు