సన్‌ఫార్మాకు మరో భారీ షాక్‌ : షేరు పతనం

18 Jan, 2019 11:59 IST|Sakshi

ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా షేరు శుక్రవారం భారీగా పతనాన్ని నమోదు చేసింది. అతిపెద్ద ఔషధ తయారీ కంపెనీ కార్పొరేట్ పాలనపై తాజా ఆందోళనల నేపథ్యంలో ఇంట్రాడేలో సన్‌ఫార్మా ఏకంగా 13 శాతానికి పైగా నష్టపోయి, టాప్ లూజర్‌గా నిలిచింది. దీంతో 6 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరింది. సన్ ‌ఫార్మా షేరు పడిపోవడంతో ఫార్మా ఇండెక్స్ కూడా పతనమైంది. సెబీకి అందిన  ఫిర్యాదు మేరకు ప్రకారం  సంస్థకు సంబంధించి అనేక కీలకమైన అవకతవకలు వెలుగు చూశాయి.  దీంతో ఇప్పటికే ప్రమోటర్లపై నమ్మకం కోల్పోతున్న తరుణంలో మరో వార్త సన్ ఫార్మాపై కోలుకోలేని దెబ్బగా పరిణమించబోతోంది.

మనీలైఫ్ మేగజైన్ ప్రకారం.. ఆదిత్య మెడీసేల్స్ అనే సోల్ డిస్ట్రిబ్యూషన్ సంస్థను సన్ ఫార్మా ప్రమోటర్లు  దిలీప్ సంఘ్వీ, సునీల్ వాడియా ఏర్పాటు చేసి దాని ద్వారా అమ్మకాలు కొనసాగిస్తున్నారని తేలింది.  2014 నుంచి 2017 మధ్యకాలంలో ఆదిత్య మెడిసేల్స్ కంపెనీ.. సన్ ఫార్మా సహ వ్యవస్థాపకుడు సుధీర్ విలియాకు నియంత్రణలోని సురక్ష రియల్టీ మధ్య రూ.5,800 కోట్లకుపైగా లావాదేవీలు జరిగాయని, వీటికి తోడు ఆదిత్య మెడీ ద్వారా సురక్షా రియాల్టీ అనే సంస్థతో కలిసి సుమారు ఐదారువేల కోట్ల లావాదేవీలు జరిపినట్టు మనీ లైఫ్ ప్రచురించింది. సంస్థ ప్రమోటర్లుగా సన్ ఫార్మాను అడ్డం పెట్టుకుని ప్రమోటర్లు వ్యక్తిగత వ్యాపారాలను కొనసాగిస్తున్నారంటూ ఒక వ్యక్తి సెబీకి ఫిర్యాదు చేశారు. ర్యాన్‌బాక్సీ ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సెబీకి ఫిర్యాదు చేసిన వ్యక్తే సన్ ఫార్మాపై తాజాగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దిలీప్ సంఘ్వీ సహా అతని బావమరిది సుధీర్ వాలియాపై సెబీకి 172 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు.  ఈ వ్యవహారంలో అనేక సాక్ష్యాధారాలను ప్రొడ్యూస్‌ చేసిన నేపథ్యంలో సెబీ దర్యాప్తునకు ఆదేశించినట్టు  సమాచారం.
 

మరిన్ని వార్తలు