గూగుల్ ట్రెడిషన్ ను బ్రేక్ చేసిన పిచాయ్

29 Apr, 2016 17:47 IST|Sakshi
గూగుల్ ట్రెడిషన్ ను బ్రేక్ చేసిన పిచాయ్

శాన్ హోసె: ఆన్ లైన్ దిగ్గజ సంస్థ గూగుల్ లో సంప్రదాయాన్ని సీఈవో సుందర్ పిచాయ్ బ్రేక్ చేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది గూగుల్ ఇన్వెస్టర్లకు ఆ సంస్థ నుంచి లేఖలు వెళ్లాయి. అయితే గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్జీ బ్రిన్ ఈ లేఖలు రాయలేదు. సంప్రదాయానికి భిన్నంగా సీఈవో పిచాయ్ లేఖలు రాశారు. నిజానికి పిచాయ్ గూగుల్ వ్యవస్థాపకుడు కాదు. ఆయనకు అత్యంత ప్రాధాన్యం దక్కిందని ఈ ఉదంతం రుజువు చేస్తోంది. అంతేకాదు పిచాయ్ పనితీరు పట్ల లారీ పేజ్, సెర్జీ బ్రిన్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ లేఖలో పిచాయ్ ను పరిచయం చేస్తూ లారీ పేజ్ రాసిన ఇంట్రడక్షన్ లో ఆయనపై ప్రశంసలు కురిపించారు. పిచాయ్ పనితీరు అద్భుతంగా ఉందని కొనియాడారు.

ఆరు ప్రధాన విభాగాలపై దృష్టి సారించాల్సిన అవసరముందని పిచాయ్ తన లేఖలో పేర్కొన్నారు. గూగుల్ ప్రారంభమైన కొత్తలో సమాచారం అందించే బాధ్యతను మాత్రమే నిర్వర్తించిందని తర్వాత ప్రాధాన్యాలు మారాయన్నారు. 'టెక్నాలజీ అంటే డివైసెస్ లేదా ప్రొడక్టులను తయారు చేయడమే కాదు. లక్ష్యాలు ఉంటూనే ఉంటాయి. టెక్నాలజీ అనేది ప్రజాస్వామ్యీకరణ శక్తి. సమాచారం ద్వారా ప్రజలను సాధికారత దిశగా నడిపించాల'ని పిచాయ్ పేర్కొన్నారు.

ప్రజలు విభిన్న తరహాలో సమాచారం కోరుకుంటున్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందుకోసం ఏఐ, స్మార్ట్ ఫోన్ సంబంధిత టెక్నాలజీలో గూగుల్ పెట్టుబడులు పెడుతోందని వెల్లడించారు. తన లేఖను గూగుల్ ప్లస్, ట్విటర్, పేస్‌ బుక్ లో షేర్ చేశారు.

మరిన్ని వార్తలు