రూ.2 వేలకే స్మార్ట్‌ఫోన్‌!

6 Jan, 2017 00:38 IST|Sakshi
ఐఐటీ ఖరగ్‌పూర్‌ విద్యార్థులతో మాటామంతీ

డిజిటల్‌ సేవల విస్తృతికి చౌకగా అందించాల్సిన అవసరం ఉంది...
డిజిటల్‌ ఎకానమీలో ప్రపంచ అగ్రగామిగా భారత్‌
గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌


ఖరగ్‌పూర్‌: డిజిటల్‌ సేవలు మరింత మంది ప్రజలకు చేరువయ్యేందుకు వీలుగా ప్రారంభ స్థాయి స్మార్ట్‌ఫోన్లు 30 డాలర్లకే (సుమారు రూ.2 వేలు) అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ అన్నారు. భారత పర్యటనలో ఉన్న పిచాయ్‌ గతంలో తాను చదువుకున్న ఐఐటీ ఖరగ్‌పూర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా 3,500 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్న సభలో మాట్లాడారు. ‘‘డిజిటల్‌ ప్రపంచంతో అనుసంధానాన్ని పెంచేందుకు వీలుగా చౌకైన, ప్రారంభ స్థాయి స్మార్ట్‌ఫోన్లను చూడాలని కోరుకుంటున్నాను. ధరలను మరింత తక్కువ స్థాయికి తీసుకురావాల్సిన అవసరం ఉంది.

ఇది 30 డాలర్ల స్థాయి కావచ్చు (రూ.2,000)’’ అని పిచాయ్‌ పేర్కొన్నారు. గూగుల్‌ గతంలో మైక్రోమ్యాక్స్, కార్బన్, స్పైస్‌ మొబైల్‌ తయారీ సంస్థలతో టైఅప్‌ అయి ‘ఆండ్రాయిడ్‌ వన్‌’ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఈ మోడల్‌ ధర రూ.6,000కుపైనే ఉంది. ఆ తర్వాత ఇంతకంటే తక్కువ ధరకే మంచి ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌ ప్రవేశం చేశాయి. అయినప్పటికీ రూ.2,000కే మంచి సదుపాయాలున్న స్మార్ట్‌ఫోన్‌ ఇంత వరకూ రాలేదు. ఇందుకోసం కనీసం రూ.3,000పైన పెట్టాల్సి వస్తోంది.