పిచాయ్‌ పంటపండింది.. 2500 కోట్ల రివార్డు!

23 Apr, 2018 16:17 IST|Sakshi

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ పంట పండింది. అక్షరాల 380 మిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 2,524 కోట్ల) రివార్డు ఆయన సొంతం కానుంది. 2014లో గూగుల్‌లో తనకు లభించిన ప్రమోషన్‌కు ప్రతిఫలంగా 3,53,939 వాటాలు (రిస్ట్రిక్టెడ్‌ షేర్స్‌) బుధవారం విడుదల కానున్నాయి. దీంతో ఈ మొత్తం వాటాల విలువ ఆయనకు దక్కనుందని బ్లూమ్‌బర్గ్‌ వెబ్‌సైట్‌ వెల్లడించింది. ఇటీవలికాలంలో ఓ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌కు ఇంత భారీస్థాయిలో ప్యాకేజీ ఇవ్వడం ఇదే కావడం గమనార్హం.

ఆల్ఫాబెట్‌ కంపెనీ నేతృత్వంలోని గూగుల్‌ కంపెనీకి సుందర్‌ పిచాయ్‌ (45) 2015 నుంచి నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అంతకుముందు ఏడాది సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందినందుకు ప్రతిఫలంగా ఈ షేర్లను కంపెనీ ఆయనకు కట్టబెట్టింది. దీంతోపాటు గూగుల్‌ ఫౌండర్‌ ల్యారీ పేజ్‌ బాధ్యతలు కూడా చాలామటుకు ఆయనకు బదలాయించారు. ఆయనకు వాటాలు బదలాయించిన తర్వాత వాటి విలువ 90శాతం మేరకు పెరిగింది. 2017వ సంవత్సరానికిగాను సుందర్‌ పిచాయ్‌కి చెల్లించాల్సిన ప్యాకేజీని ఇంకా గూగుల్‌ వెల్లడించలేదు.

>
మరిన్ని వార్తలు