సరిలేరు ‘సుందర్‌’కెవ్వరు..!

5 Dec, 2019 04:33 IST|Sakshi
సుందర్‌ పిచాయ్‌

గూగుల్‌ చీఫ్‌ సుందర్‌ పిచాయ్‌కు ప్రమోషన్‌

ఇకపై అల్ఫాబెట్‌ సీఈవోగా కూడా ఆయనే...

కీలక హోదాల నుంచి తప్పుకున్న వ్యవస్థాపకులు  

హోదాల బదలాయింపుతో అల్ఫాబెట్‌ సంస్థాగత స్వరూపంలో గానీ రోజువారీ కార్యకలాపాల్లో గానీ పెద్ద మార్పులేమీ ఉండబోవు. ఎప్పట్లాగే ఇకపైనా గూగుల్‌ని మరింత వృద్ధిలోకి తెచ్చేందుకు కృషి చేస్తా. కంప్యూటింగ్‌ హద్దులు చెరిపేసేందుకు, అందరికీ మరింత ఉపయోగకరంగా ఉండేలా గూగుల్‌ను తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొనసాగుతాయి. పెను సవాళ్లను టెక్నాలజీతో పరిష్కరించే దిశగా అల్ఫాబెట్‌ దీర్ఘకాలిక వ్యూహాల అమలు కూడా కొనసాగుతుంది.
– సుందర్‌ పిచాయ్‌

వాషింగ్టన్‌: టెక్నాలజీ ప్రపంచంలో మనోళ్ల హవా కొనసాగుతోంది. టెక్‌ దిగ్గజం గూగుల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ (సీఈఓ)గా ఉన్న సుందర్‌ పిచాయ్‌ (47)... తాజాగా దాని మాతృసంస్థ అల్ఫాబెట్‌కూ సీఈవోగా నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఈ బాధ్యతల్లో ఉన్న గూగుల్‌ సహ వ్యవస్థాపకులు ల్యారీ పేజ్, సెర్గీ బ్రిన్‌ వాటి నుంచి తప్పుకున్నారు. తాజా పరిణామంతో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కార్పొరేట్‌ దిగ్గజాల్లో ఒకరిగా సుందర్‌ పిచాయ్‌ నిలవనున్నారు. మరో టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు తెలుగువాడైన సత్య నాదెళ్ల సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.  

కొత్త మార్పులపై కంపెనీ ఉద్యోగులకు పేజ్, బ్రిన్‌ లేఖ రాశారు. అల్ఫాబెట్‌ ప్రస్తుతం గట్టిగా నిలదొక్కుకుందని, గూగుల్‌తో పాటు ఇతర అనుబంధ సంస్థలూ స్వతంత్రంగా రాణిస్తున్నాయని... మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను సరళీకరించేందుకు ఇదే సరైన తరుణమని వారు పేర్కొన్నారు. ‘కంపెనీని మరింత మెరుగ్గా నడిపించగలిగే మార్గాలున్నప్పుడు.. మేము మేనేజ్‌మెంట్‌ హోదాలకు అతుక్కుని ఉండదల్చుకోలేదు. అల్ఫాబెట్, గూగుల్‌ సంస్థలకిక ఇద్దరు సీఈవోలు, ఒక ప్రెసిడెంట్‌ అవసరం లేదు. ఇకపై రెండింటికీ సుందరే సీఈవోగా ఉంటారు.

గూగుల్‌కు సారథ్యం వహించడంతో పాటు ఇతర అనుబంధ సంస్థల్లో అల్ఫాబెట్‌ పెట్టుబడులన్నింటినీ ఆయనే చూస్తారు‘ అని పేజ్, బ్రిన్‌ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోనూ బోర్డు సభ్యులుగా, షేర్‌హోల్డర్లుగా, సహ–వ్యవస్థాపకులుగా గూగుల్, అల్ఫాబెట్‌ వృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని తెలిపారు. ‘దాదాపు 15 సంవత్సరాలుగా.. అల్ఫాబెట్‌ ఏర్పాటులోనూ, గూగుల్‌ సీఈవోగా, అల్ఫాబెట్‌ డైరెక్టరుగా సుందర్‌ పిచాయ్‌ మాతో కలిసి నడిచారు. అల్ఫాబెట్‌ భవిష్యత్తుపైన, సవాళ్లను టెక్నాలజీ సాయంతో అధిగమించేలా చేయగలిగే సంస్థ సామర్థ్యంపైనా మాకున్నంత నమ్మకం ఆయనకూ ఉంది‘ అని పేజ్, బ్రిన్‌ తెలిపారు.  

సెర్చికి పర్యాయపదంగా గూగుల్‌...
ఒకప్పటి దిగ్గజం యాహూను పక్కకు నెట్టేసి.. ఇంటర్నెట్‌లో సెర్చికి పర్యాయపదంగా మారిన గూగుల్‌ను సెర్గీ బ్రిన్, ల్యారీ పేజ్‌ 1998లో ఆరంభించారు. పేజ్‌ తొలి సీఈవో కాగా... తర్వాత 2001 నుంచి 2011 దాకా ఎరిక్‌ ష్మిట్‌ ఆ హోదాలో కొనసాగారు. తర్వాత పేజ్‌ మళ్లీ కొన్నాళ్ల పాటు సీఈవోగా వచ్చారు. 2015లో హోల్డింగ్‌ కంపెనీగా అల్ఫాబెట్‌ను ఏర్పాటు చేసినప్పట్నుంచీ బ్రిన్, పేజ్‌.. గూగుల్‌లో కీలక పాత్ర పోషించడాన్ని తగ్గించుకున్నారు.

సింపుల్‌.. సుందర్‌
ఐఐటీలో చదివేటప్పుడు తనకు ఒక దశలో సీ గ్రేడ్‌ రావడం.. మళ్లీ మెరుగుపడటానికి తాను కిందా మీదా పడటం లాంటి ఆసక్తికరమైన విషయాలను కొన్నాళ్ల కిందట ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విద్యార్థులతో సమావేశమైన సందర్భంగా పిచాయ్‌ చెప్పారు. చిన్నప్పటి సాదా సీదా జీవితాన్ని ఒక పత్రిక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఇప్పటితో పోలిస్తే అప్పట్లో మా జీవితం సింపుల్‌గా, హాయిగా ఉండేది. ఒక మోస్తరు అద్దింట్లో ఉంటూ లివింగ్‌ రూమ్‌లో హాయిగా కింద పడుకునేవాళ్లం. ఒకసారి తీవ్ర కరువొచ్చింది. అదెంత భయపెట్టిందంటే.. ఇప్పటికీ నేను పడుకునేటప్పుడు మంచం పక్కన మంచినీటి బాటిల్‌ పెట్టుకుంటాను. మేం ఫ్రిజ్‌ కొనుక్కోవడం అప్పట్లో మాకో గొప్ప విశేషం‘ అని ఆయన చెప్పుకొచ్చారు. గూగుల్‌లో టీమ్‌ను ముందుండి నడిపించగలిగే సత్తాతో టాప్‌ మేనేజ్‌మెంట్‌ దృష్టిలో పడ్డారు. మృదు భాషిగా, ఎవర్నీ నొప్పించకుండా సమస్యలను పరిష్కరించగలిగే వ్యక్తిగా సుందర్‌ గురించి ఆయన సన్ని హితులు చెబుతారు. విభిన్న ఉత్పత్తులపై, టెక్నాలజీపై పరిజ్ఞానంతో పాటు ఈ సామర్థ్యాలే ఆయన్ను గూగుల్‌లో కీలక వ్యక్తిగా నిలిపాయి.

మదురై టు సిలికాన్‌ వ్యాలీ...
సుందర్‌ పిచాయ్‌ తమిళనాడులోని మదురైలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. తండ్రి ఎలక్ట్రికల్‌ ఇంజనీరు కాగా తల్లి స్టెనోగ్రాఫర్‌. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌ చేస్తూ అక్కడే తన జీవిత భాగస్వామి అంజలిని కలిశారు. తరవాత అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీలో ఎంఎస్‌ చేశారు. ఎంబీఏ అనంతరం 2004లో గూగుల్‌లో చేరారు. కీలకమైన క్రోమ్‌ బ్రౌజర్‌ ప్రాజెక్టును విజయవంతం చేశాక కంపెనీలో ఆయన వేగంగా ఎదిగారు. 2013లో ముఖ్యమైన ఆండ్రాయిడ్‌ డివిజన్‌ ఇన్‌చార్జిగా... తర్వాత రెండేళ్లకే 2015లో గూగుల్‌ సీఈవో అయ్యారు. దాంతోనే పలు అల్ఫాబెట్‌ ప్రాజెక్టులూ ఆయన పరిధిలోకి వచ్చాయి. ఇటీవల ఉద్యోగుల నిరసనల్లాంటి వాటితో పాటు పలు వివాదాలను సమర్థంగా ఎదుర్కొన్న తీరు.. అల్ఫాబెట్‌ సీఈవో పీఠానికి ఆయన్ను మరింత దగ్గర చేశాయి.


భార్య అంజలితో సుందర్‌ పిచాయ్‌

మరిన్ని వార్తలు