కృత్రిమ మేధపై కలసికట్టుగా..

23 Jan, 2020 05:20 IST|Sakshi

అప్పుడే రిస్క్‌లను అధిగమించొచ్చు

అందరికీ స్వేచ్ఛతో కూడిన ఇంటర్నెట్‌ ఇవ్వాలి

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌

దావోస్‌ (స్విట్జర్లాండ్‌): స్వేచ్ఛతో కూడిన ఉచిత ఇంటర్నెట్‌ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ అందించాలని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. కృత్రిమ మేధ (ఏఐ) నియంత్రణపై ప్రపంచదేశాలు ఒక్కతాటిపైకి వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్‌) 50వ వార్షిక సదస్సులో భాగంగా సుందర్‌ పిచాయ్‌ ప్రసంగించారు. గోప్యత అన్నది ఖరీదైన వస్తువేమీ కాదంటూ ప్రతి ఒక్కరికీ ఆ రక్షణ కల్పించాలని అభిప్రాయపడ్డారు.

‘‘ఉచిత, స్వేచ్ఛాయుత ఇంటర్నెట్‌ అందరికీ అవసరం. డేటా సార్వభౌమత్వం ప్రతీ దేశానికి ముఖ్యమైనది. కనుక ప్రపంచంలో ఏ దేశంలో అయినా డేటా పరిరక్షణకు దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఇంటర్నెట్‌ నిజానికి ఒక ఎగుమతి వస్తువు. యూట్యూబ్‌లో ఒక భారతీయ పౌరుడు ఒక వీడియోను పోస్ట్‌ చేస్తే దాన్ని ప్రపంచవ్యాప్తంగా చూస్తారు. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ సౌందర్యం ఇదే’’ అని పిచాయ్‌ చెప్పారు. ఆధునిక ప్రపంచంలో ఏఐ అద్భుత పాత్రను పోషిస్తుందన్నారు. ఏఐ రిస్క్‌ల గురించి అవగాహన ఉందని, ఇది బిలియన్ల ప్రజలపై ప్రభావం చూపుతుందన్నారు.

క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ను గొప్ప మైలురాయిగా అభివర్ణించారు. ‘‘సంప్రదాయ కంప్యూటర్లు చేయలేని ఎన్నో పనులను క్వాంటమ్‌ కంప్యూటర్లు చేయగలవు. వీటి సాయంతో ప్రకృతి మెరుగ్గా మారేలా ప్రేరేపించొచ్చు. వాతావరణం, ప్రకృతి మార్పుల గురించి మెరుగ్గా అంచనా వేయొచ్చు. టెక్నాలజీలో క్వాంటమ్‌ భవిష్యత్తులో పెద్ద ఆయుధంగా మారుతుంది. ఏఐ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ కలయిక అద్భుతంగా ఉంటుంది’’ అని పిచాయ్‌ చెప్పారు. ఏఐపై ఒక కం పెనీ లేక ఒక దేశమో పనిచేయడం కాకుండా కలసికట్టుగా పనిచేసే అంతర్జాతీయ విధానం అవసరమని సూచించారు.  

గూగుల్‌ శక్తి పెరిగితే ప్రమాదకరమా..?
ఈ ప్రశ్నను గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కు డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ క్లాస్‌ష్వాబ్‌ సంధించారు. దీనికి పిచాయ్‌ స్పందిస్తూ.. ‘‘ఇతరులు కూడా మాతో సమానంగా మంచి పనితీరు చూపించినప్పుడే మేము సైతం మంచిగా పనిచేయగలం. సరైన పరిశీలన అనంతరమే మా స్థాయి విషయంలో ముందడుగు ఉంటుంది. మా వెంచర్ల ద్వారా ఏటా వందలాది స్టార్టప్‌లలో ఇన్వెస్ట్‌ చేస్తూనే ఉన్నాం’’ అని తెలిపారు. ప్రజల జీవితాలను టెక్నాలజీతో ఏవిధంగా మెరుగుపరచొచ్చన్న దానిపై గూగుల్‌ పనిచేస్తుందని భవిష్యత్తు ప్రణాళికలపై బదులిచ్చారు.

సదస్సులో ఇతర అంశాలు..
► డబ్ల్యూఈఎఫ్‌ ఐటీ గవర్నర్ల కమ్యూనిటీకి చైర్మన్‌గా హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సీఈవో సీ విజయ్‌కుమార్‌ పనిచేయనున్నట్టు డబ్ల్యూఈఎఫ్‌ ప్రకటించింది.  

► ప్రపంచ ఆర్థిక వేదిక పునఃనైపుణ్య విప్లవాత్మక కార్యక్రమంలో భారత్‌ వ్యవస్థాపక సభ్య దేశంగా చేరింది. నాలుగో పారిశ్రామిక విప్లవానికి చేయూతగా 2030 నాటికి 100 కోట్ల మందికి మెరుగైన విద్య, నైపుణ్యాలను అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం.  

► కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ దక్షిణ కొరియా వాణిజ్య మంత్రి యూమైంగ్‌హితో దావోస్‌లో భేటీ అయ్యారు. వీరి మధ్య ద్వైపాక్షిక వాణిజ్య అంశాలు చర్చకు వచ్చాయి. భారతీయ రైల్వే రంగంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే అంశంపైనా చర్చ నిర్వహించారు. పలు కంపెనీల సీఈవోలూ సమావేశమయ్యారు.

మరిన్ని వార్తలు