రాయల్‌ సుందరంలో ఏజీస్‌కు వాటా!

15 Nov, 2018 00:15 IST|Sakshi

25.90% విక్రయిస్తున్న సుందరం

డీల్‌ ద్వారా చేతికి రూ.1,520 కోట్లు

చెన్నై: సుందరం ఫైనాన్స్‌ సంస్థ, సాధారణ బీమా కంపెనీ రాయల్‌ సుందరంలో తనకున్న 75.90 శాతం వాటా నుంచి 25.90% వాటాను ఏజీస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకుంది.ఈ డీల్‌ విలువ రూ.1,520 కోట్లు. విక్రయం తర్వాత కూడా రాయల్‌ సుందరంలో సుందరం ఫైనాన్స్‌కు 50% వాటా ఉంటుంది. ఈ డీల్‌ ఐఆర్‌డీఏ తదితర సంస్థల అనుమతులపై ఆధారపడి ఉంటుందని, 2019 తొలి క్వార్టర్‌లో డీల్‌ పూర్తి కావచ్చని సుందరం ఫైనాన్స్‌ ప్రకటించింది. రాయల్‌ సుందరం ప్రధానంగా మోటార్, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ విభాగంలో బలంగా ఉంది. 5,600 మంది ఏజెంట్లతో పాటు, 700 శాఖలున్నాయి. 2018 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం రూపంలో రూ.2,643 కోట్లు ఆదాయాన్ని, పన్ను అనంతరం రూ.83 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

ప్రీమియం ఆదాయంలో 19%, నికర లాభంలో 56% చొప్పున వృద్ధి నమోదయ్యాయి. తదుపరి దశ వృద్ధి కోసం ఏజీస్‌తో జత కట్టామని సుందరం ఫైనాన్స్‌ ఎండీ టీటీ శ్రీనివాసరాఘవన్‌ తెలిపారు. ఏజీస్‌కు ఉన్న అంతర్జాతీయ అనుభవం తమకు విలువైన ఆస్తిగా అభివర్ణించారు. ఆసియాలో స్థానిక భాగస్వామ్యాలు, జాయింట్‌ వెంచర్ల ద్వారా ఏజీస్‌ అనుసరించే భిన్న విధానం రాయల్‌ సుందరంకు గణనీయమైన విలువను తెచ్చిపెడుతుందని రాఘవన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, రానున్న ఏళ్లలో గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న భారత బీమా రంగ మార్కెట్‌ తమకు గొప్ప అవకాశాలు కల్పిస్తోందని ఏజీస్‌ సీఈవో బార్ట్‌దే స్మెట్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు