విందాం.. చిట్టిగుండె చప్పుడు!

18 Jan, 2019 09:49 IST|Sakshi

సునో.. మై బేబీ హార్ట్‌ బీట్‌’ పరికరానికి రూపకల్పన  

మాతృత్వపు అనుభూతులను ఆనందించే అవకాశం

గర్భిణి సైతం శిశువు హృదయ స్పందనల్ని వినవచ్చు  

సరికొత్త డివైజ్‌ను కనుగొన్న నగర యువకులు పవన్, సాద్‌

మాతృత్వంలోనే ఉంది మహిళ జన్మసార్థకం. అమ్మ అనిపించుకొనుటే స్త్రీమూర్తికి గౌరవం. బిడ్డ కడుపులో³డగానే తల్లి ఎనలేని సంతోషాన్నిపొందుతుంది. మరి గర్భస్థ శిశువు భూమిమీద పడకముందే హృదయస్పందనలు తెలుసుకుంటే అంతకుమించిన ఆనందం ఆ తల్లికి మరేముంటుంది. అదిగో ఆ దిశగా కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. గర్భంలో ఉన్న బేబీ హార్ట్‌ బీట్‌ను స్పష్టంగా వినేందుకు ‘సునో’ పేరుతో ఓ డివైజ్‌ను కనుగొన్నారు నగరానికి చెందిన ఇద్దరు యువకులు. ప్రస్తుతం ఈ డివైజ్‌ గర్భిణులు తమ బేబీ హృదయ స్పందనలు వినేందుకు ఉపయుక్తంగా మారింది..

హిమాయత్‌నగర్‌: నగరంలోని వెస్ట్‌మారేడుపల్లికి చెందిన పవన్‌కుమార్‌ బిట్స్‌ పిలానీలో ఇంజినీరింగ్‌ (ఎలక్ట్రానిక్స్‌) పూర్తి చేశారు. ఎండీ సాధ్‌ గుంటూరులోని ఎన్‌ఆర్‌ఐ కళాశాల్లో ఇంజినీరింగ్‌ చేశారు. ‘డుకేరా టెక్నాలజీస్‌’లో ఉద్యోగం చేస్తున్న క్రమంలో ఇరువురి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ సమయంలో కంటిచూపు లేని వారి కోసం ప్రత్యేకంగా షూస్‌ను రూపొందించారు. ఇవి అంధులకు ఎంతో ఉపయోగకరంగా మారాయి. అదే ఉత్సాహంతో మరేదైనా కొత్త ఆవిష్కరణ చేయాలనే తపనతో పరిశోధన చేయసాగారు. ఈ నేపథ్యంలోనే గర్భిణులకు ఉపయుక్తంగా ఉండే ఉపకరణం ఏదైనా కనుగొనాలనే ఆలోచన వచ్చింది. దీంతో బేబీ హార్ట్‌ బీట్‌ వినేందుకు ఓ డివైజ్‌ను రూపొందించారు.  

వాట్సాప్‌ ద్వారా షేర్‌ చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీ మొదలైనప్పటి నుంచి బేబీపై దంపతులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. భార్యభర్తల మధ్య జరిగే సంభాషణ కూడా బేబీ గురించే ఉంటుంది. ఈ డివైజ్‌ ద్వారా హార్ట్‌బీట్‌ను  స్నేహితులు, బంధువులతోనూ షేర్‌ చేసుకోవచ్చు. హార్ట్‌బీట్‌ వింటున్న సమయంలో యాప్‌లో షేర్‌ అనే ఆప్షన్‌ వస్తుంది. ఆ ఆప్షన్‌ని ఎంచుకుని నచ్చిన వారికి ఒక్క క్లిక్‌తో బేబీ హార్ట్‌బీట్‌ను షేర్‌ చేసుకోవచ్చు.   

నార్మల్‌డెలివరీ కోసం ప్రత్యేక తరగతులు..
‘వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌’ లెక్కల ప్రకారం ఇతర దేశాల్లో శస్త్రచికిత్సలు 10 నుంచి15 శాతం నమోదవుతున్నాయి. మన దేశంలో 23 నుంచి 75 శాతం నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో సిజేరియన్‌లు 75 శాతం నమోదవుతున్నట్లు ‘వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌’ స్పష్టం చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న పవన్, ఎండీ సాధ్‌లు పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. ఈ నెల చివర్లో చైల్డ్‌ బెర్త్‌ ఎడ్యుకేషన్‌ కాన్సెప్ట్‌తో ప్రెగ్నెన్సీ ఉమెన్స్‌కి ఆన్‌లైన్‌లో క్లాసెస్‌ను చెప్పేందుకు సిద్ధమయ్యారు. ప్రెగ్నెన్సీ మొదలైనప్పటి నుంచి బేబీ డెలివరీ అయ్యే వరకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎన్ని గంటలు నిద్రపోవాలి అనే అన్ని విషయాలను ఆన్‌లైన్‌ ద్వారా క్లాసెస్‌ చెబుతారు. ప్రస్తుతానికి దీనిని దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ప్రారంభించనున్నారు. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా దీనిలో రిజిస్టరైన వారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే వారికి కన్వినెంట్‌గా ఉన్న సమయంలో క్లాసెస్‌ వినొచ్చు. దీని ద్వారా సిజేరియన్‌లు తగ్గి నార్మల్‌ డెలివరీకి మార్గం సులభమవుతుందని చెబుతున్నారు పవన్, సాద్‌.  

ఇలావినవచ్చు..
రిసీవర్, ఎక్స్‌టెన్షన్‌ బాక్స్, రెండు కేబుళ్లతో ఎలక్రానిక్‌ డివైజ్‌ను రూపొందించారు. దీనికి ‘సునో’  అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ డివైజ్‌ ఆన్‌లైన్‌లో రూ.2500, మార్కెట్‌లో రూ.3 వేలకు లభిస్తోంది. గర్భిణుల కోసం దీనిని కొనుగోలు చేయవచ్చు. ముందుగా మొబైల్‌లో ‘సునో’ అనే యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకుని రిజిస్టర్‌ కావాలి. అనంతరం రీసీవర్‌కు రెండు కేబుల్స్‌ని కనెక్ట్‌ చేయాలి. ఈ రెండు కేబుళ్లల్లో ఒకటి మొబైల్‌కు పెట్టే ఆడియో కేబుల్, మరొకటి రిసీవర్‌కు పెట్టేది. ఈ రెండు కనెక్ట్‌ చేశాక యాప్‌లోని ఆప్షన్స్‌ని ఎంచుకుని డివైజ్‌ను గర్భిణి తన పొత్తికడుపుపై పెట్టుకొని బేబీ బీట్‌ను స్పష్టంగా వినవచ్చు. గర్భస్థ శిశువుకు 7 నెలలు నిండిన తర్వాత నుంచి ఈ హార్ట్‌బీట్‌ వినవచ్చని పవన్, సాద్‌లు చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు