సూపర్‌మార్కెట్లలో నిషేధిత పదార్థాల వెల్లువ

27 Jul, 2018 13:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సూపర్‌ మార్కెట్లలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న జన్యుమార్పిడి ఆహార పదార్థాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయంటూ ఓ షాకింగ్‌ రిపోర్ట్‌ వెలువడింది. నిషేధిత  జీఎం(జెనిటికల్లీ మోడిఫైడ్‌) ఆహార పదార్థాలను ఆకర్షణీయమైన ప్యాకేజీల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌(సీఎస్‌సీ) నివేదించింది. విదేశాలకు  చెందిన ఫ్యాన్సీ ఉత్పతులు ముఖ్యంగా శిశువుల ఆహార ఉత్పత్తులు వుండటం ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. పాన్‌ కేక్‌ సిరప్‌, మల్టీ గ్రెయిన్‌ సిరల్స్‌( సెరిలాక్‌ లాంటివి) కార్న్‌ పఫ్స్‌, నూనెలు లాంటివి అమ్ముతున్నారని తెలిపింది.

గుజరాత్, పంజాబ్, ఢిల్లీ  ప్రాంతాల్లో సంస్థ పరిశోధకులు 65 ఆహార నమూనాలను పరీక్షించారు. వీటిల్లో 21 నమూనాల్లో 32 శాతం జీఎం పాజిటివ్ అని కనుగొన్నారు.  భారతదేశంలో తయారు చేసిన వాటిల్లో 30 శాంపిల్స్‌లో  కేవలం ఐదు లేదా 17 శాతం జీఎం పాజిటివ్‌గా  ఉండగా,  కెనడా, యుఎఇ,  అమెరికా, నెదర్లాండ్స్, థాయ్‌లాండ్‌ నుంచి దిగుమతి చేసుకున్న  35శాంపిల్స్‌లో 16-46 శాతం  జీఎం పాజిటివ్‌గా ఉన్నాయని నివేదించింది.  అలాగే జీఎం పాజిటివ్‌ అయి వుండి  జీఎం ఫ్రీ పేరుతో  అక్రమంతా విక‍్రయిస్తున్న  ఉత్పత్తులు దాదాపు 15శాతం  ఉన్నట్టు  వెల్లడించింది.  జన్యుమార్పిడి  ఆహారాలకు దేశంలో అనుమతి లేనప్పటికీ , సూపర్‌ మార్కెట్‌లో  ఇలా అక్రమంగా విక్రయిస్తున్నారని  తాజా  అధ్యయనంలో సీఎస్‌ఈ తేల్చింది.  పైగా వీటిల్లో కొన్నింటిని  జీఎం ఫ్రీ అని తప్పుడు ప్రకటనలతో మోసం చేస్తున్నారని నివేదించింది. ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం, 2006 లోని సెక్షన్ 22 ప్రకారం జన్యుమార్పిడి ఆహార ఉత్పత్తులను భారతదేశంలో తయారుచేయడం, దిగుమతి లేదా విక్రయించడం  నిషేధమని పేర్కొంది.

నిఘా విభాగం  లోపం వల్లే  దేశంలోని అనేక సూపర్‌మార్కెట్లలో జన్యుమార్పిడి ఆహార పదార్థాల విక్రయాలు  జరుగుతున్నాయని  జీఎస్‌ఈ డైరెక్టర్ జనరల్‌ సునీతా నారెన్ చెప్పారు. ముఖ్యంగా చిన్నపిల్లల ఆహార ఉత్పత్తులు జన్యుమార్పిడివి వుండటం ఆందోళకరమన్నారు.అంతేకాదు జీఎం ఫ్రీ అనే లేబుల్‌తో ఈ ఉత్పత్తులను విక్రయించడం మరింత  విచారకరమని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా అమెరికా,  నెదర్లాండ్స్  నుంచి దిగుమతి చేసుకున్న ఎనిమిదింటిలో రెండు  చిన్నారి ఆహార పదార్థాల నమూనాలు జీఎం   పాజిటివ్‌గా ఉన్నప్పటికీ,  లేబుళ్ళు ఈ విషయాన్ని వెల్లడించలేదని తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ అంటీముట్టనట్టు వ్యవహరిస్తోందని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇందు భూషణ్  వ్యాఖ్యానించారు. జన్యుపరంగా మార్పు చెందిన బిటి పత్తి పెంపకానికి మాత్రమే భారత్‌లో అనుమతి ఉందన్నారు.

అమెరికాకు చెందిన  ప్రముఖ ఫార్మ కంపెనీ శిశువుల ఆహార  ఉత్పత్తులను (జీఎం, నాన్‌ జీఎం) విక్రయిస్తుందని కానీ అక్కడి సూపర్‌మార్కెట్లలో సంబంధిత సూచనలు,  తప్పనిసరి  హెచ్చరికలుంటాయని సునీతా చెప్పారు. కానీ భారతదేశంలో అలా  ఎందుకు కాదు అని ఆమె ప్రశ్నించారు. జన్యుమార్పిడి ఆహార పదార్థాలు హానికరమైనవా, కాదా అనేదానిపై సుదీర్ఘ చర్చ ఉన్నప్పటికీ,  వీటి ఎంపికలో  వినియోగదారుడికి స్వేచ్ఛ ఉండాలని ఆమె అన్నారు.
 

మరిన్ని వార్తలు