మద్దతు 27,500-నిరోధం 28,030

13 Jul, 2015 01:14 IST|Sakshi
మద్దతు 27,500-నిరోధం 28,030

మార్కెట్ పంచాంగం
ప్రపంచ స్టాక్ మార్కెట్లు గ్రీసు సంక్షోభంతో సతమతమవుతున్న సమయంలో నాటకీయంగా చైనా మార్కెట్ పతనం అల్లకల్లోలం సృష్టించింది. ముగిసిన గురు, శుక్రవారాల్లో చైనా మార్కెట్ కోలుకున్నప్పటికీ, దాదాపు సగం షేర్లలోనే ట్రేడింగ్ జరిగినందున, ఆ రికవరీ కొనసాగుతుందో, లేదో డౌటే. అక్కడ పతనం నేపథ్యంలో సగం షేర్లలో ట్రేడింగ్ రద్దుచేశారు.

మరోవైపు గ్రీసు బెయిలవుట్ ప్యాకేజీని కోరుతూ సమర్పించిన కొత్త ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుందన్న అంచనాలతో శుక్రవారం ప్రపంచంలో అన్ని మార్కెట్లూ ర్యాలీ జరిపాయి. కానీ గ్రీసుకు ప్యాకేజీ ఇచ్చే అంశమై యూరప్ దేశాల్లో చీలిక వచ్చినట్లు తాజాగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రీసు, చైనా అంశాలు రానున్న కొద్దిరోజుల్లో స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేయవచ్చు. ఇక మన సూచీల సాంకేతికాంశాలకొస్తే...
 
సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
జూలై 10తో ముగిసిన వారం ప్రథమార్ధంలో 28,335 పాయింట్ల గరిష్టస్థాయిని చేరిన తర్వాత ద్వితీయార్ధంలో 27,530 పాయింట్ల కనిష్టస్థాయికి బీఎస్‌ఈ సెన్సెక్స్ పడిపోయింది. చివరకు దాదాపు 1.53 శాతం నష్టంతో 27,661 పాయింట్ల వద్ద ముగిసింది.  ఈ సోమవారం సెన్సెక్స్ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 27,500 స్థాయి వద్ద చిన్నపాటి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన సెన్సెక్స్ ప్రారంభమైతే, వేగంగా జూన్ 29నాటి కనిష్టస్థాయి 27,209 పాయింట్ల స్థాయిని తిరిగి పరీక్షించవచ్చు.

రానున్న కొద్దిరోజుల్లో ఈ స్థాయిని వదులుకుంటే, తర్వాతి వారాల్లో 26,300 పాయింట్ల స్థాయికి పతనమయ్యే ప్రమాదం వుంటుంది. ఈ వారం గ్యాప్‌అప్‌తో మార్కెట్ మొదలైతే 28,030 పాయింట్ల స్థాయి తొలి నిరోధాన్ని కల్పించవచ్చు. ఈ స్థాయిని అధిగమించి, ముగిస్తే  28,335 పాయింట్ల స్థాయిని చేరవచ్చు.  ఈ స్థాయిని బలంగా ఛేదిస్తే 28,700 స్థాయికి పెరిగే అవకాశాలుంటాయి. అటుపైన స్థిరపడితే కొద్ది వారాల్లో 29,090 పాయింట్ల స్థాయిని చేరవచ్చు.
 
నిఫ్టీ తక్షణ మద్దతు 8,300-నిరోధం 8,460
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గతవారం 8,500 పాయింట్లపైన స్థిరపడి, పాజిటివ్ ముగింపు కనపర్చినా, చైనా మార్కెట్ నాటకీయంగా పతనమయిన ప్రభావంతో ఈ సూచీ కూడా పడిపోయింది. చివరకు అంతక్రితం వారంకంటే 124 పాయింట్ల క్షీణతతో 8,361 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం గ్యాప్‌డౌన్‌తో మార్కెట్ మొదలైతే 8,300 పాయింట్ల స్థాయి తొలి మద్దతును అందించవచ్చు.  ఈ స్థాయిని కోల్పోతే క్రమేపీ 8,195 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు.

గ్రీసు, చైనా సంక్షోభాలు తలెత్తి తీవ్రస్థాయిలో ప్రపంచ మార్కెట్లను చుట్టుముడితే 7,940 స్థాయి వద్దకు సైతం పతనమయ్యే ప్రమాదం వుంటుంది. ఈ సోమవారం గ్యాప్‌అప్‌తో మొదలైతే 8,460 పాయింట్ల స్థాయి వద్ద తొలి అవరోధం ఏర్పడవచ్చు. ఈ స్థాయిని అధిగమించి, స్థిరపడితే క్రమేపీ 8,550 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో ఛేదిస్తే కొద్దివారాల్లో 8,845 పాయింట్ల స్థాయిని చేరే చాన్స్ వుంటుంది.

>
మరిన్ని వార్తలు