అమితాబ్ కు మళ్లీ ‘ఐటీ’ చిక్కులు!

12 May, 2016 01:05 IST|Sakshi
అమితాబ్ కు మళ్లీ ‘ఐటీ’ చిక్కులు!

పాత అసెస్‌మెంట్‌ను తిరగదోడేందుకు
ఐటీ శాఖకు సుప్రీం అనుమతి

 న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను(ఐటీ) చెల్లింపు వివాదానికి సంబంధించి బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు మళ్లీ చిక్కులు మొదలయ్యాయి. 2001-02 అసెస్‌మెంట్ ఏడాదికిగాను అమితాబ్ ఆదాయ వివరాల వెల్లడి విషయంలో తాము వేసిన కేసును మళ్లీ తిరగదోడేందుకు ఐటీ శాఖను సుప్రీం కోర్టు బుధవారం అనుమతించింది. జస్టిస్ రంజన్ గొగోయ్, పీసీ పంత్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశించింది. అమితాబ్ ఐటీ చెల్లింపునకు సంబంధించి మళ్లీ మదింపు(అసెస్‌మెంట్) చేయాలంటూ ముంబై ఐటీ కమిషర్ ఇచ్చిన ఆదేశాలను బెంచ్ సమర్థించింది.

ఐటీ శాఖ దాఖలు చేసిన రెండు ప్రత్యేక అభ్యర్ధనలకు అంగీకరించడంతోపాటు అంతక్రితం ఈ కేసులో బాంబే హైకోర్టు, ఐటీ అప్పీలేట్ ట్రిబ్యునల్(ఐటీఏటీ) ఇచ్చిన తీర్పులను పక్కనబెడుతున్నట్లు కూడా ధర్మాసనం పేర్కొంది. 2001-02లో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ క్విజ్ ప్రోగామ్ నిర్వహణకు గాను అమితాబ్‌కు భారీమొత్తంలో పారితోషకం లభించిందని.. అయితే, ఆయన మాత్రం తమకు రూ.కోట్లలో పన్నును చెల్లించాల్సి ఉన్నప్పటికీ, చెల్లించకుండా తప్పించుకున్నారనేది ఐటీ శాఖ వాదన.

>
మరిన్ని వార్తలు