-

బెయిల్ కోసం విదేశీ రుణం!

10 Jan, 2015 15:16 IST|Sakshi
బెయిల్ కోసం విదేశీ రుణం!

సహారా విజ్ఞప్తికి సుప్రీం అనుమతి ఆర్‌బీఐ అనుమతి తప్పనిసరి
న్యూఢిల్లీ: జైలు నుంచి తమ చీఫ్ సుబ్రతారాయ్ బెయిల్‌పై విడుదలకు కొంత మొత్తాన్ని విదేశీ రుణ రూపంలో సమీకరించుకోడానికి వీలు కల్పించాలని సహారా గ్రూప్ చేసిన విజ్ఞప్తికి సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే ఈ నిధులు దేశంలోకి రావడానికి సంబంధించిన ఫెమా నిబంధనలన్నింటినీ  పాటించాలని పేర్కొంది. ప్రత్యేకించి రిజర్వ్ బ్యాంక్ నుంచి తగిన అనుమతులు పొందాలని స్పష్టం చేసింది.  

ఈ రూలింగ్‌తో అమెరికా సంస్థ మిరేజ్ కేపిటల్ నుంచి 1050 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.6,510 కోట్లు)  పొందేందుకు సహారా గ్రూప్‌కు వీలు కుదిరింది.  గ్రూప్‌కు విదేశాల్లో ఉన్న మూడు హోటళ్లలో వాటా తనఖాగా ఈ నిధులను  మిరేజ్ కేపిటల్ అందిస్తుంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మిరేజ్ కేపిటల్ నుంచి సహారాకు 650 మిలియన్ డాలర్లు లోన్‌గా, 400 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో అందుతుంది.  

రెండు సహారా గ్రూప్ కంపెనీలు ఇన్వెస్టర్ల నుంచి మార్కెట్ నిబంధనలకు వ్యతిరేకంగా దాదాపు రూ.24 వేల కోట్ల నిధుల సమీకరణ... పునఃచెల్లింపుల వైఫల్యం... కోర్టు ధిక్కరణ కేసు నేపథ్యంలో సహారా చీఫ్ రాయ్ 2014 మార్చి నుంచి తీహార్ జైలులో ఉన్నారు. మొత్తం డబ్బు సమకూర్చడానికి వీలుగా మధ్యంతర బెయిల్ పొందడానికి రూ.10,000 కోట్లు చెల్లించాలని సుప్రీం గతంలో షరతు విధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు