డీఎల్‌ఎఫ్‌కు సుప్రీం షాక్

28 Aug, 2014 02:46 IST|Sakshi
డీఎల్‌ఎఫ్‌కు సుప్రీం షాక్

న్యూఢిల్లీ: రియల్టీలో గుత్తాధిపత్యం ప్రదర్శిస్తూ... అక్రమ వ్యాపార విధానాలను అనుసరించిందన్న కేసులో ఆ రంగంలో దిగ్గజ సంస్థ డీఎల్‌ఎఫ్‌కు అత్యున్నత న్యాయస్థానం బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఫెయిర్ ట్రేడ్ రెగ్యులేటర్ కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీఐఐ) గతంలో విధించిన రూ.630 కోట్ల జరిమానాను అత్యున్నత న్యాయస్థానం రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని డీఎల్‌ఎఫ్‌ను ఆదేశించింది. మూడు వారాల్లో రూ.50 కోట్లను, మొత్తం డబ్బును మూడు నెలల్లో తన రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని నిర్దేశించింది. తద్వారా సీఐఐ, అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన రూలింగ్‌పై స్టేకు ససేమిరా అంది. విచారణకు మాత్రం డీఎల్‌ఎఫ్ అప్పీల్‌ను అడ్మిట్ చేసింది.

అప్పీల్ పెండింగ్‌లో ఉండగా రూ.630 కోట్లు డిపాజిట్ చేయాల్సిన డీఎల్‌ఎఫ్, ఒకవేళ అప్పీల్‌లో తనకు వ్యతిరేకంగా తీర్పువచ్చే మొత్తం నిధులపై 9 శాతం వడ్డీని కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి అండర్‌టేకింగ్ ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్, జస్టిస్ ఎన్‌వీ రమణలతో కూడిన ధర్మాసనం కీలక మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 2011, నవంబర్ 9వ తేదీన సీఐఐ ఈ కేసులో తన ఉత్తర్వులు వెలువరించినప్పటి నుంచి వడ్డీ చెల్లింపు వర్తిస్తుంది. డిపాజిట్‌ను చెల్లించడానికి ఆరు నెలల సమయం ఇవ్వాలని డీఎల్‌ఎఫ్ కోరినప్పటికీ, దీనిని సుప్రీం తిరస్కరించింది. డీఎల్‌ఎఫ్ డిపాజిట్ చేసిన మొత్తాన్ని జాతీయ బ్యాంకు ఎందులోనైనా ఇన్వెస్ట్ చేయవచ్చని కూడా అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

 వివరాలు ఇవీ...
 ఈ కేసులో సుప్రీంలో రెస్పాండెంట్లుగా రెసిడెంట్స్ అసోసియేషన్‌తో పాటు హర్యానా ప్రభుత్వం, హర్యానా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌యూడీఏ) ఉన్నాయి. గుర్గావ్‌లోని బెలైరీ ఓనర్స్ అసోసియేషన్ (కొనుగోలుదారుల అసోసియేషన్) 2010 మేలో డీఎల్‌ఎఫ్‌పై ఒక ఫిర్యాదుచేసింది. వ్యాపారంలో గుత్తాధిపత్య ధోరణిని ప్రదర్శిస్తూ, నిబంధనలను సంస్థ పట్టించుకోలేదని కొనుగోలుదారులు పేర్కొన్నారు.

అపార్ట్‌మెంట్స్ కేటాయింపుల్లో పూర్తి ఏకపక్ష ధోరణిని సంస్థ అవలంబించిందనీ, అసమంజస, అర్థంలేని నిబంధనలను విధించిందని బెలైరీ ఓనర్స్ అసోసియేషన్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఇవి కొనుగోలుదారుల హక్కులకు పూర్తిగా విఘాతం కలుగజేసినట్లు అసోసియేషన్ సీఐఐకి విన్నవించింది.  2013-14లో డీఎల్‌ఎఫ్ ఆదాయం రూ.8,298 కోట్లు. ఈ మొత్తంలో రూ.630 కోట్లు 7.5 శాతానికి సమానం.

 మెరిట్స్‌పై విశ్వాసం: డీఎల్‌ఎఫ్
 సుప్రీంకోర్టు ఆదేశాలను శిరసా పాటిస్తామని డీఎల్‌ఎఫ్  పేర్కొంది. ఈ కేసులో మెరిట్స్ పట్ల తనకు పూర్తి విశ్వాసముందని సైతం పేర్కొంది. సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల కాపీ కోసం ఎదురుచూస్తున్నట్లు బీఎస్‌ఈకి సమర్పించిన ఒక ఫైలింగ్‌లో తెలిపింది.

 నష్టాల్లో కంపెనీ షేరు...
 సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో డీఎల్‌ఎఫ్ షేరు బుధవారం భారీ నష్టాన్ని చవిచూసింది. బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర క్రితం ముగింపుతో పోల్చితే 4.44 శాతం (రూ.8.50) దిగజారి, రూ.183.05 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు