ఆమ్రపాలి గ్రూపునకు సుప్రీం షాక్‌

23 Jul, 2019 11:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద రియల్ ఎస్టేట్  సంస్థ ఆమ్రపాలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు సుప్రీం కోర్టులో భారీ షాక్‌ తగిలింది.  ఇప్పటికే అనేకసార్లు ఆమ్రపాలి గ్రూప్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత ధర్మాసనం తాజా సంచలన తీర్పును వెలువరించింది.  సంస్థ  రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రేరా) నమోదుతోపాటు అన్ని రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తూ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అలాగే కంపెనీ డైరెక్టర్లు అందరిపైనా మనీ లాండరింగ్ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) ను ఆదేశించింది.  సంస్థ లావాదేవీలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని ఈడీని ఆదేశించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ  ఆదేశాలిచ్చింది. తద్వారా సుమారు 42వేల గృహ కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చింది.  తదుపరి విచారణను ఆగస్టు 9వ తేదీకి వాయిదా వేసింది. 

అంతేకాదు కోర్టు రిసీవర్‌గా ఆర్‌ వెంకట్రామన్‌ను నియమించింది. భారతదేశం అంతటా అన్ని ప్రాజెక్టుల ప్రమోటర్లపై చర్యలు తీసుకోవాలని, అవి సకాలంలో పూర్తయ్యేలా చూసుకోవాలని, ప్రమోటర్లందరి ఉల్లంఘనలపై నివేదికను తయారు చేయాలని కేంద్ర, రాష్ట్ర స్థాయిలో సంబంధిత మంత్రిత్వ శాఖలను కోర్టు కోరింది. ఇద్దరు ఆడిటర్లలో ఒకరైన అనిల్ మిట్టల్‌పై విచారణ జరిపి ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని  సుప్రీం చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. 

నోయిడా, గ్రేటర్ నోయిడా పరిధిలో మధ్యలో ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేయాలని సుప్రీం ప్రత్యేక ఆదేశాలిచ్చింది. ఆ నిర్మాణాలను చేపట్టాల్సిందిగా నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌ను సుప్రీం ఆదేశించింది. నిర్మాణాలు పూర్తైన తర్వాత వినియోగదారులకు అప్పగించాలని ఆదేశాల్లో పేర్కొంది.

కాగా గృహనిర్మాణాల కోసం వినియోగదారుల నుంచి సేకరించిన నిధులను ఇతర సంస్థల్లోకి మళ్లించారన్న కుంభకోణంలో ఆమ్రపాలి చిక్కుకుంది. అలాగే  ఆమ్రపాలి గ్రూప్‌నకు ప్రచారకర్తగా వ్యవహరించిన తనను మోసం చేసిందని టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 

చదవండి : అవినీతికి మరణశిక్ష విధించలేం: సుప్రీం 

నన్ను రూ.40 కోట్లకు ముంచారు : ధోని

మరిన్ని వార్తలు