ఎస్సార్‌ స్టీల్‌.. ఆర్సెలర్‌దే!!

16 Nov, 2019 04:13 IST|Sakshi

టేకోవర్‌కు మార్గం సుగమం

ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలు కొట్టేసిన సుప్రీం కోర్టు

వాటాలపై సీవోసీదే అంతిమ నిర్ణయం

బ్యాంకులకే మొదటి ప్రాధాన్యం

రుణదాతలందరినీ ఒకే గాటన కట్టలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టీకరణ 

న్యూఢిల్లీ: దివాలా తీసిన ఎస్సార్‌ స్టీల్‌ను ఉక్కు దిగ్గజం ఆర్సెలర్‌ మిట్టల్‌ సొంతం చేసుకునేందుకు మార్గం సుగమం అయ్యింది. ఇందుకు సంబంధించి ఆర్సెలర్‌మిట్టల్‌ సమర్పించిన రూ. 42,000 కోట్ల బిడ్‌కు అనుకూలంగా సుప్రీం కోర్టు శుక్రవారం కీలక తీర్పునిచ్చింది. బిడ్‌ మొత్తాన్ని ఫైనాన్షియల్‌ రుణదాతలు (బ్యాంకులు మొదలైనవి), ఆపరేషనల్‌ రుణదాతలు (సరఫరాదారులు మొదలైన వర్గాలు) సమానంగా పంచుకోవాలంటూ నేషనల్‌ కంపెనీ లా అపీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) గతంలో ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది.

బాకీలు రాబట్టుకోవడంలో మొదటి ప్రాధాన్యత ఫైనాన్షియల్‌ రుణదాతలకే ఉంటుందని, రుణదాతల కమిటీ (సీవోసీ) తీసుకున్న వ్యాపారపరమైన నిర్ణయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవడానికి లేదని జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌ సారథ్యంలోని త్రిసభ్య బెంచ్‌ పేర్కొంది. సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్‌ రుణదాతలకు సమాన హోదా ఉండబోదని స్పష్టం చేసింది. 2018 అక్టోబర్‌ 23న ఆర్సెలర్‌మిట్టల్‌ సమర్పించిన పరిష్కార ప్రణాళికకు అనుగుణంగా ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొంది.

మార్గదర్శకాలకు అనుగుణంగా అమలు చేయాలంటూ న్యాయస్థానం.. పరిష్కార ప్రణాళికను సీవోసీకి తిప్పిపంపగలదే తప్ప, రుణదాతల కమిటీ తీసుకున్న వ్యాపారపరమైన నిర్ణయాన్ని మార్చజాలదని సుప్రీం కోర్టు తెలిపింది. పరిష్కార ప్రణాళికను రూపొందించేందుకు దివాలా కోడ్‌లో నిర్దేశించిన 330 రోజుల గడువును కూడా సడలించింది. సీవోసీ పరిష్కార ప్రణాళిక అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడేలా ఉండాలని సూచించింది. ఎస్సార్‌స్టీల్‌ వేలం ద్వారా వచ్చే నిధులను రుణదాతలంతా సమాన నిష్పత్తిలో పంచుకోవాలన్న ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలను సవాల్‌ చేస్తూ బ్యాంకులు దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీం కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.   

వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేస్తాం: ఆర్సెలర్‌మిట్టల్‌
సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించిన ఆర్సెలర్‌మిట్టల్‌.. సాధ్యమైనంత త్వరగా ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామని ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు, బిడ్‌ చేసిన ఆర్సెలర్‌ మిట్టల్, దాని భాగస్వామ్య సంస్థ నిప్పన్‌ స్టీల్‌కు ఎస్సార్‌ స్టీల్‌ శుభాకాంక్షలు తెలిపింది. ప్రపంచ స్థాయి సంస్థను దక్కించుకుంటున్నాయని పేర్కొంది.

బ్యాంకులకు ఊరట..
ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ, పీఎన్‌బీ, ఐడీబీఐ బ్యాంకులతో పాటు ప్రైవేట్‌ రంగ ఐసీఐసీఐ బ్యాంక్, ఎడెల్వీస్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ తదితర సంస్థలకు సుప్రీం కోర్టు తీర్పు ఊరటనివ్వనుంది. స్టాన్‌చార్ట్‌ డీబీఎస్‌ బ్యాంక్‌ వంటి ఆపరేషనల్‌ రుణదాతలకు ప్రాధాన్యం తగ్గనుంది. ఎస్‌బీఐకు ఎస్సార్‌ స్టీల్‌ అత్యధికంగా రూ. 15,430 కోట్లు బాకీ పడింది. రుణదాతల కమిటీ (సీవోసీ) నిర్ణయం ప్రకారం ఎస్సార్‌ స్టీల్‌ వేలం ద్వారా వచ్చే నిధుల పంపకాలకు సంబంధించి బ్యాంకుల్లాంటి సెక్యూర్డ్‌ రుణదాతలు తమకు రావాల్సిన బకాయిల్లో 90% దాకా, రూ. 100 కోట్ల పైగా రుణాలిచ్చిన ఆపరేషనల్‌ రుణదాతలు తమకు రావాల్సిన దాంట్లో 20.5% దాకా క్లెయిమ్‌ చేసుకోవచ్చు. కానీ దీన్ని తోసిపుచ్చిన ఎన్‌సీఎల్‌ఏటీ.. బ్యాంకులకు 60.7% మేర, రూ. 100 కోట్లు పైగా రుణాలిచ్చిన ఆపరేషనల్‌ రుణదాతలు 59.6% దాకా క్లెయిమ్‌ చేసుకునే వీలు కల్పించింది. దీన్నే సవాలు చేస్తూ బ్యాంకులు.. సుప్రీంను ఆశ్రయించాయి.

రెండేళ్ల తర్వాత ఒక కొలిక్కి..
ఎస్సార్‌ స్టీల్‌ సంస్థ బ్యాంకులకు, ఇతరత్రా రుణదాతలకు రూ. 54,547 కోట్ల మేర బకాయిపడింది. భారీ డిఫాల్టర్లకు సంబంధించి రెండేళ్ల క్రితం ఆర్‌బీఐ ప్రకటించిన తొలి జాబితాలోని 12 సంస్థల్లో ఇది కూడా ఉంది. దీంతో బాకీలను రాబట్టుకునేందుకు ఆర్థిక సంస్థలు.. దివాలా స్మృతి (ఐబీసీ) కింద అప్పట్నుంచి ప్రయత్నాలు ప్రారంభించాయి. ఆ తర్వాత ఇది అనేక మలుపులు తిరిగింది. దివాలా తీసి, వేలానికి వచ్చిన తమ సంస్థ చేజారిపోకుండా తిరిగి దక్కించుకునేందుకు ప్రమోటర్లయిన రుయా కుటుంబం వివిధ మార్గాల్లో తీవ్రంగా ప్రయత్నించింది. ఆర్సెలర్‌మిట్టల్‌ ఆఫర్‌ చేసిన రూ. 42,000 కోట్ల కన్నా ఎక్కువగా రూ. 54,389 కోట్లు కడతాము, వేలాన్ని నిలిపివేయాలంటూ కోరింది. కానీ ఎన్‌సీఎల్‌టీ దీన్ని తోసిపుచ్చింది. దివాలా స్మృతికే సవాలుగా నిల్చిన ఈ కేసు ఫలితం .. ఇలాంటి మిగతా కేసులపైనా ప్రభావం చూపనుండటంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు