వడ్డీమీద వడ్డీనా..?

18 Jun, 2020 05:28 IST|Sakshi

ఈఎంఐల మారటోరియంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

ఇందులో ఔచిత్యత లేదు

ప్రయోజనం నెరవేరేలా పథకాన్ని సమీక్షించాలని కేంద్రం, ఆర్‌బీఐలకు సూచన

ఆగస్టు తొలి వారానికి విచారణ వాయిదా

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 కష్ట కాలంలో బ్యాంకింగ్‌ రుణ బకాయిల నెలవారీ చెల్లింపులపై (ఈఎంఐ) ప్రకటించిన మారటోరియం విధానం ఇందుకు సంబంధించిన ప్రయోజనం నెరవేరేట్లు లేదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇది వడ్డీమీద వడ్డీ విధింపులా ఉందని పేర్కొంటూ, ఇలాంటి విధానంలో ఔచిత్యం ఏదీ కనబడ్డంలేదని వ్యాఖ్యానించింది. కేసు తదుపరి విచారణను ఆగస్టు మొదటి వారానికి వాయిదా వేసిన జస్టిస్‌ అశోక్‌ భూషన్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం, మారటోరియం పథకాన్ని పునఃసమీక్షించాలని కేంద్రం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) లకు సూచించింది.

ఈ అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి ప్రత్యేకంగా సూచించిన అత్యున్నత న్యాయస్థానం, ఈ వ్యవహారాన్ని బ్యాంకులకు పూర్తిగా వదిలేయరాదనీ స్పష్టంచేసింది. ఇది కస్టమర్‌కు, బ్యాంకులకు మధ్య వ్యవహారమని కేంద్రం చెప్పనేరదనీ తెలిపింది. అసలు ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయని అత్యున్నత న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కొంది. ఇందులో  మారటోరియం కాలంలో అసలు వడ్డీ విధించకపోవడం ఒకటికాగా, వడ్డీమీద వడ్డీ విధింపు (మారటోరియం కాలంలో వడ్డీని అసలుకు కలిపి, తిరిగి వడ్డీ విధించడం) రెండవదని అభిప్రాయపడింది. మొత్తం వడ్డీ రద్దుకాకపోయినా, వడ్డీమీద వడ్డీనైనా తొలగించే విధానం ఉండాలని సూచించింది.  

21వ అధికరణకు విఘాతం
కోవిడ్‌–19 నేపథ్యంలో బ్యాంకింగ్‌ రుణ బకాయిల నెలవారీ చెల్లింపులపై ఆగస్టు 31వ తేదీ వరకూ అమలుకానున్న మారటోరియం సమయంలో విధించే వడ్డీరేటు సమంజసం కాదంటూ, ఆగ్రాకు చెందిన గజేంద్ర శర్మ అనే వ్యక్తి దాఖలు చేసిన  ఒక పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ అంశాన్ని విచారిస్తున్న త్రిసభ్య ధర్మాసనంలో జస్టిస్‌ అశోక్‌ భూషన్, జస్టిస్‌ ఎస్‌కే కౌల్, ఎంఆర్‌ షాలు ఉన్నారు. నిజానికి మే 31 వరకూ అమల్లో ఉన్న ‘మారటోరియం’ను ఆగస్టు 31 వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే.

మారటోరియం కాలంలో వడ్డీ భారం వేయడం రుణ గ్రహీతలకు శిక్ష విధించడమేనని పిటిషనర్‌ తరఫు న్యాయవాది అతున్నత న్యాయస్థానానికి విన్నవించారు. రాజ్యాంగంలోని 21వ అధికరణం కల్పిస్తున్న ‘జీవించే హక్కు’కు ఇది విఘాతం కలిగిస్తోందని కూడా కోర్టుకు తెలిపారు. మారటోరియం సమయంలో వడ్డీభారం లేని రుణ పునఃచెల్లింపులకు వీలుకల్పిస్తూ కేంద్రం, ఆర్‌బీఐలకు ఆదేశాలు ఇవ్వాలనీ ఆయన కోరారు.ఈ అంశంపై కొత్త మార్గదర్శకాలు తెచ్చే అవకాశం ఏదైనా ఉంటుందా? అన్న అంశంపై ఆలోచన చేయాలని ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌కూ తాజాగా సుప్రీం సూచించింది.

మా ప్రయోజనాలకు విఘాతం: డిపాజిటర్లు
రుణ చెల్లింపులపై మారటోరియం కాలంలో వడ్డీని మాఫీ చేస్తే అది బ్యాంకు డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని అఖిల భారత డిపాజిటర్ల అసోసియేషన్‌ (ఏఐబీడీఏ) ఆందోళన వ్యక్తం చేసింది. ఎటువంటి వడ్డీ మాఫీ అయినా  అది రుణ సంస్కృతిని దెబ్బతీస్తుందని, బ్యాంకుల ఆర్థిక పరిస్థితిపై దాని ప్రభావం ఉంటుందని పేర్కొంది. రుణాలపై వడ్డీ మాఫీకి అనుమతిస్తే.. అప్పుడు బ్యాంకులు అనివార్యంగా తమ వడ్డీ ఆదాయ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను మరింత తగ్గిస్తాయని ఏఐబీడీఏ ఆందోళన వ్యక్తం చేసింది. చారిత్రకంగా చూస్తే రుణాలపై వడ్డీ రేట్లను మాఫీ చేస్తే సార్వభౌమ (కేంద్ర ప్రభుత్వం) రక్షణ ఉంటుందని, కానీ ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ నష్టాలున్న పరిస్థితుల్లో అందుకు అవకాశం ఉండదని పేర్కొంది.  

వడ్డీ రద్దు అంత తేలిక్కాదు: కేంద్రం, ఆర్‌బీఐ
కేంద్రం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా త్రిసభ్య ధర్మాసనం ముందు తన వాదనలు వినిపిస్తూ, రుణాలపై వడ్డీ పూర్తి రద్దు బ్యాంకులకు అంత తేలిక్కాదని విన్నవించారు. బ్యాంకులు కూడా తమ డిపాజిట్లకు వడ్డీరేటు చెల్లించాలన్న విషయాన్ని గుర్తించాల్సి ఉంటుందని అన్నారు. రూ.133 లక్షల కోట్ల డిపాజిట్లు బ్యాంకుల వద్ద ఉన్నాయని సొలిసిటర్‌ జనరల్‌ వివరించారు. రుణాలపై వడ్డీని రద్దు చేస్తే, బ్యాంకింగ్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు.

ఆర్థిక స్థిరత్వానికీ ఇది ప్రతికూలమన్నారు. బ్యాంక్స్‌ అసోసియేషన్, ఎస్‌బీఐ న్యాయవాది ఈ అంశంపై విచారణను మూడు నెలలు వాయిదా వేయాలని సుప్రీంకోర్టును కోరారు. అసలు వడ్డీరద్దు అంశంపై ఇప్పటికిప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడం ‘ముందస్తు’ నిర్ణయం అవుతుందని, ప్రతి ఖాతాకు సంబంధించి వేర్వేరుగా ఈ అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుందనీ ఆయన అన్నారు. మారటోరియం కాలంలో వడ్డీ తొలగిస్తే, బ్యాంకింగ్‌పై ఆ ద్రవ్య భారం ఎంత ఉందన్న విషయంపైనా ఒక అంచనాకు రావాల్సి ఉందని న్యాయవాది పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు