బీఎస్‌ 4 వాహన సేల్స్‌కు డెడ్‌లైన్‌ పొడిగింపు

27 Mar, 2020 18:32 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో బీఎస్‌4 అమ్మకాలకు ఈనెల 31వరకూ ఉన్న తుదిగడువును మరో 10 రోజులు పాటు సర్వోన్నత న్యాయస్ధానం పొడిగించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న క్రమంలో డీలర్లకు వెసులుబాటు కల్పించేలా డెడ్‌లైన్‌ను సుప్రీంకోర్టు పొడిగించింది. లాక్‌డౌన్‌ ముగిసిన పదిరోజుల వరకూ బీఎస్‌4 వాహనాలను విక్రయించాలని, ఈ గడువులోపే వాహన రిజిస్ర్టేషన్‌లను పూర్తిచేయాలని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఏప్రిల్‌ 14న 21 రోజుల లాక్‌డౌన్‌ ముగియనుండటంతో డీలర్లు ఏప్రిల్‌ 24వరకూ తమ వద్ద ఉన్న బీఎస్‌ 4 వాహనాలను విక్రయించుకునే వెసులుబాటు కలిగింది. బీఎస్‌ 4 వాహన విక్రయాలకు ప్రభుత్వం విధించిన మార్చి 31 డెడ్‌లైన్‌ను సవాల్‌ చేస్తూ ఆటోమొబైల్‌ డీలర్ల సమాఖ్య (ఎఫ్‌ఏడీఏ), సొసైటీ ఆఫ్‌ ఆటోమొబైల్‌ మ్యాన్యుఫ్యాక్చరర్స్‌ (ఎస్‌ఐఏఎం) సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

ఆటో పరిశ్రమలో స్లోడౌన్‌, కరోనావైరస్‌ లాక్‌డౌన్‌ కారణంగా షోరూంలలో 15,000 కార్లు, 12,000 వాణిజ్య వాహనాలు, 7 లక్షల ద్విచక్రవాహనాల అమ్మకాలు నిలిచిపోయాయయని ఎఫ్‌ఏడీఏ కోర్టుకు నివేదించింది. బీఎస్‌ 4 వాహన విక్రయాల డెడ్‌లైన్‌ను పొడిగించి పర్యావరణంపై భారం మోపలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ వ్యాపారాలు, డీలర్ల పరిస్థితిని తాము అర్ధం చేసుకోగలమని, మార్చిలో కొద్దిరోజులు లాక్‌డౌన్‌ ప్రకటించిన క్రమంలో మీరు దాన్ని అవకాశంగా తీసుకోవాలని భావిస్తున్నారని వ్యాఖ్యానించింది. దేశ పర్యావరణ హితం కోసం మనం త్యాగాలు చేయకతప్పదని పేర్కొంది. ఇక పదిరోజుల పాటు డెడ్‌లైన్‌ను పొడిగించడంతో ఆటోమొబైల్‌ పరిశ్రమకు సర్వోన్నత న్యాయస్ధానం కొంతమేర ఊరట ఇచ్చింది.

చదవండి : కరోనా వ్యాప్తి : సుప్రీం కీలక ఆదేశాలు

>
మరిన్ని వార్తలు