కార్తీ చిదంబరానికి మరో ఎదురుదెబ్బ

12 Mar, 2018 14:06 IST|Sakshi
కార్తి చిదంబరం (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి సుప్రీంకోర్టులో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్‌ కేసు విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎయిర్‌సెల్‌, మ్యాక్సిస్‌ ఒప్పందానికి ఎఫ్‌ఐపీబీ(విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి) అనుమతులపై  సీబీఐ, ఈడీలు గత కొన్నేళ్ల నుంచి విచారణ చేస్తున్నాయి. ఈ విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాల్సిందేనని సుప్రీం గట్టి ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ ఒప్పందపు కేసు 2006 నాటిది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసుతో పాటు కార్తి చిదంబరంపై ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్‌ కేసులోనూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

రూ.600 కోట్లకు పైబడిన విదేశీ పెట్టుబడులకు అనుమతివ్వాలంటే ఆ విషయాన్ని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి నివేదించాలి. అయితే 2006లో విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి రూ.3,500 కోట్ల విలువైన ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ ఒప్పందాన్ని ఆమోదించింది. ఈ విషయమై సీబీఐ ఆర్థిక మంత్రికి రూ.600 కోట్లలోపు ఒప్పందాలకు అనుమతిచ్చే అధికారమే ఉందని, ఈ డీల్ అంతకుమించినదైనప్పటికీ ఎలా అనుమతిచ్చారంటూ సీబీఐ అప్పటి ఆర్థికమంత్రి చిందంబరాన్ని పలుమార్లు ప్రశ్నించింది. ఎయిర్‌సెల్‌కు ఎఫ్‌ఐపీబీ అనుమతి కోసం 2006 ఏప్రిల్‌ 11న రూ.26 లక్షల ముడుపులు కార్తి చిదంబరం పుచ్చుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. చిదంబరంతో పాటు కార్తిపై కూడా ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు వస్తుండటంతో, ఇప్పటికే ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో తీవ్ర ఉచ్చులో బిగుసుకుపోయిన కార్తికి ఇది మరో ఎదురుదెబ్బగా మారింది. ఇప్పటికే ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఆయన సీబీఐ కస్టడీలో ఉన్నారు. కార్తి బెయిల్‌పై మార్చి 15న విచారణ జరుగనుంది. మరోవైపు తనకు ప్రాణహాని ఉందని, వీఐపీ ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలంటూ కార్తి చిదంబరం కోరారు. అయితే కార్తీ వాదనను సీబీఐ కొట్టిపారేసింది. 

మరిన్ని వార్తలు