సహారా రాయ్‌కి షాక్‌

7 Feb, 2017 01:02 IST|Sakshi
సహారా రాయ్‌కి షాక్‌

యాంబీ వ్యాలీ జప్తు
సుప్రీం కోర్టు ఆదేశం   
ఫిబ్రవరి 20కి కేసు వాయిదా  


న్యూఢిల్లీ: రెండు సహారా గ్రూప్‌ సంస్థలు మదుపరుల నుంచి మార్కెట్‌ నిబంధనలకు విరుద్ధంగా దాదాపు రూ.25,000 కోట్ల సమీకరణ, ఆ నిధుల పునఃచెల్లింపుల్లో వైఫల్యం కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. పుణేలో సహారాకు చెందిన ప్రతిష్టాత్మక యాంబీ వ్యాలీని జప్తు చేయాలని సోమవారం అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ప్రఖ్యాత యాంబీ వ్యాలీ విలువ దాదాపు రూ.39,000 కోట్లు.

యాంబీ తిరిగి ఇచ్చేయాలంటే!?
యాంబీ వ్యాలీని సహారాకు వదిలివేయడానికి సైతం సుప్రీం కీలక సూచన చేసింది. వేలం వేయడానికి,  నిధులను ఇన్వెస్టర్లకు  తిరిగి చెల్లించడానికి ఉద్దేశించి ‘తాకట్టు, న్యాయ చిక్కుల్లోలేని’ అన్ని ఆస్తుల జాబితాను  రెండు వారాల్లో అందించాలని సహారా గ్రూప్‌కు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. చెల్లించాల్సిన అసలుకు సంబంధించి యాంబీ వ్యాలీని తిరిగి సహారాకు వదిలేస్తామని సూచించింది. ఫిబ్రవరి 20వ తేదీన జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేసును తిరిగి విచారిస్తుంది. చెల్లించాల్సిన అసలులో గ్రూప్‌ దాదాపు రూ.11,000 చెల్లించిందనీ, ఇంకా రూ.14,000 కోట్లు సెబీ–సహారా అకౌంట్‌కు జమచేయాల్సి ఉందని బెంచ్‌ స్పష్టం చేసింది. తాజా ఆదేశాలు ఈ మొత్తాల సమీకరణకు దోహదపడతాయని సూచించింది. జస్టిస్‌ రాజన్‌ గొగోయ్, ఏకే శిక్రీలు కూడా  త్రిసభ్య ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు.

27 వరకూ పెరోల్‌ పొడిగింపు
కాగా ఇంతక్రితం ఆదేశాలకు అనుగుణంగా సహారాగ్రూప్‌ అంతకుముందు రూ.600 కోట్లు సెబీ–సహారా అకౌంట్‌లో డిపాజిట్‌ చేసింది. దీనితో  రాయ్‌ తాత్కాలిక పెరోల్‌ గడువును సుప్రీం ఫిబ్రవరి 27 వరకూ పొడిగించింది. ఫిబ్రవరి 6 నాటికి ఈ మొత్తం చెల్లించకుంటే, సహారా చీఫ్‌ తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంటుందని జనవరి 12న  కోర్టు స్పష్టం చేయడం తెలిసిందే. జూలై 2019 నాటికి మొత్తం డబ్బు చెల్లించడానికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను ఆమోదించాలని అంతక్రితం సహారా చీఫ్‌ కపిల్‌ సిబల్‌ చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ‘‘చిన్న మొత్తాల్లో డబ్బు చెల్లింపులు కుదరవు’’ అని స్పష్టం చేసింది. తనఖా, న్యాయపరమైన చిక్కుల్లో లేని ఆస్తుల వేలం ద్వారా రూ.14,000 కోట్ల సమీకరణ సాధ్యమవుతుందని పేర్కొంది.

వడ్డీసహా రూ.47,669 కోట్లు!
ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన మొత్తంపై 2016 అక్టోబర్‌ 31 వరకూ సహారా గ్రూప్‌ వడ్డీసహా రూ.47,669 కోట్లు చెల్లించాల్సి ఉందని కేసు వాదనల సందర్భంగా సెబీ న్యాయవాది ప్రతాప్‌ వేణుగోపాల్‌ అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించారు.

అసలు తర్వాత వడ్డీ విషయం!
నిబంధనలకు వ్యతిరేకంగా గ్రూప్‌ డబ్బు సమీకరించిన విషయం సుస్పష్టమైందని, ఇది ఈ కేసులో కీలక అంశమని సుప్రీం పేర్కొంది. సహారాకు వ్యతిరేకంగా 2012 ఆగస్టులో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని దాఖలు చేసిన పిటిషన్‌ పెండింగులో ఉన్నందున, ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు ఏవీ ఇవ్వరాదన్న సహారా న్యాయవాది వాదనను బెంచ్‌ తోసిపుచ్చింది. ‘‘ఆస్తుల జప్తు గురించి మీరు మాట్లాడండి. మాకు మరో ప్రత్యామ్నాయం లేదు. తనఖాలోని ఆస్తుల జాబితాను అందించండి. రూ.14,000 కోట్లు సమీకరించడానికి ఈ ఆస్తుల వేలం సరిపోతుంది. తదుపరి   యాంబీ వ్యాలీని వెనక్కు తీసుకోడానికి అనుమతి  స్తాం. మీరు చెప్పింది వింటాం’’ అని బెంచ్‌ తేల్చిచెప్పింది. అసలు వచ్చాక వడ్డీ గురించి పరిశీలిద్దామని  బెంచ్‌ పేర్కొంది. డబ్బు చెల్లించడానికి సిబల్‌ సమయం అడుగుతూ.. నోట్ల రద్దు, ద్రవ్య లభ్యత సమస్యలను సైతం ప్రస్తావించారు.

మరిన్ని వార్తలు