రియల‍‍్టర్లకు వణుకు: యూనిటెక్‌ ఆస్తుల వేలానికి సుప్రీం ఆదేశాలు

22 Aug, 2018 10:56 IST|Sakshi

యూనిటెక్‌ డైరెక్టర్ల ఆస్తుల వేలానికి సుప్రీంకోర్టు ఆదేశం

జస్టిస్ ఎస్ఎన్ డింగ్రా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీకి స్పష్టమైన ఆదేశాలు

గృహకొనుగోలుదారులను మోసగించారని ఆగ్రహం

సాక్షి, న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ సంస్థల అక్రమాలపై కొరడా ఝళింపించేలా దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.  ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ యూనిటెక్‌పై సుప్రీం కోర్టు మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. యూనిటెక్‌ డైరెక్టర్ల వ్యక్తిగత ఆస్తులను వేలం వేయాలని ఆదేశించింది. మాజీ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎన్ డింగ్రా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో  కూడిన సుప్రీం ధర్మాసనం  ఈ స్పష్ట​మైన ఆదేశాలు జారీ చేసింది.

కొనుగోలుదారులను యూనిటెక్  మోసగించింది. కనుక కొనుగోలుదారుల సొమ్మును తిరిగి చెల్లించాలంటే ఆ సంస్థ ఆస్తులను వేలం వేయాల్సిందేనని గతంలోనే స్పష్టం చేసిన సుప్రీం తాజాగా ఆదేశాలిచ్చింది. సంస్థకు చెందిన కోలకతా ఆస్తులను వేలం/విక్రయించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.  తద్వారా రూ.25కోట్లను కొనుగోలుదారుల డబ్బును తిరిగి చెల్లిచాలని కోరింది. అలాగే ఈ ప్రక్రియంలో సహకారం అందించేందుకు మరో ఇద్దరు వ్యక్తులను నియమించుకునేలా సుప్రీంకోర్టు సహాయకుడు ఎమికస్ క్యూరీ పవన్‌శ్రీ అగర్వాల్‌కు అనుతినిచ్చింది. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబరు 11కి వాయిదా వేసింది.

సంస్థ డైరెకర్ట వ్యక్తిగత ఆస్తులతోపాటు ఇతర ఆస్తుల వివరాలను అందించాలని, మే 11  నాటికి 100 కోట్ల రూపాయల మేరకు డిపాజిట్ చేయకపోతే వారి ఆస్తులను వేలం వేయాలని  సుప్రీం యూనిటెక్‌ సం‍స్థను గతంలో హెచ్చరించింది. అయితే  యూనిటెక్‌ సమర్పించిన నివేదికపై   అసంతృప్తిని వ్యక్తంచేసింది.  ఈ నేపథ్యంలోనే యూనిటెక్‌కు చెందిన  ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, వారణాసి, తమిళనాడులోని శ్రీపెరంబుదుర్‌లోని ఆస్తులను  విక్రయించి, ఆ సొమ్మును గృహ కొనుగోలుదారులకు డబ్బు తిరిగి చెల్లించాలని  జూలై 5న కమిటీని కోరింది. కాగా  కొనుగోలుదారుల నుంచి డబ్బులు తీసుకుని, వారికి సరైన సమయంలో ఇళ్లను నిర్మించి ఇవ్వలేదన్న ఆరోపణలపై యూనిటెక్‌ కేసులు నమోదయ్యాయి.  ఇప్పటికే ఈ కేసులో యూనిటెక్‌ ఎండీ సంజయ్ చంద్ర, అతని సోదరుడు మరో డైరెక్టర్‌ అజయ్ చంద్ర గత ఏడాది కాలంగా జైలులో ఉన్నారు.

>
మరిన్ని వార్తలు