-

సెప్టెంబర్‌ 7లోగా రూ.1,500 కోట్లు కట్టండి

26 Jul, 2017 01:15 IST|Sakshi
సెప్టెంబర్‌ 7లోగా రూ.1,500 కోట్లు కట్టండి

సహారా చీఫ్‌ సుబ్రతా రాయ్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లకు నిధులు వాపసు చేయాల్సిన కేసుకు సంబంధించి సెప్టెంబర్‌ 7లోగా సెబీ–సహారా రిఫండ్‌ ఖాతాలో రూ. 1,500 కోట్లు జమచేయాలంటూ సహారా గ్రూప్‌ చీఫ్‌ సుబ్రతా రాయ్‌ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆయనకు మంజూరు చేసిన పెరోల్‌ గడువును అక్టోబర్‌ 10 దాకా పొడిగించింది. అటు ఆంబీ వ్యాలీ ప్రాపర్టీ విక్రయానికి సేల్‌ నోటీసును ప్రచురించడానికి బాంబే హైకోర్టుకు చెందిన అధికారిక లిక్విడేటరుకు అనుమతులిచ్చింది. కేసుపై తదుపరి విచారణను సుప్రీం కోర్టు సెప్టెంబర్‌ 11కి వాయిదా వేసింది. గ్రూప్‌ కంపెనీలైన సహారా ఇండియా రియల్‌ ఎస్టేట్‌ కార్పొరేషన్, సహారా హౌసింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌.. ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన రూ. 24,000 కోట్లు తిరిగి చెల్లించాల్సిన కేసులో సుబ్రతా రాయ్‌ దాదాపు రెండేళ్ల పాటు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.

గతేడాది మే 6న ఆయనకు పెరోల్‌ ఇచ్చిన న్యాయస్థానం నిర్దిష్ట తేదీల్లోగా నిర్దిష్ట మొత్తాన్ని జమ చేస్తూ ఉండాలని, లేని పక్షంలో పెరోల్‌ రద్దవుతుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం సుప్రీం కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా సుబ్రతారాయ్‌ తరఫున సీనియర్‌ అడ్వొకేట్‌ కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. జూలై 15 నాటికి రూ. 552.21 కోట్లు జమ చేయాల్సి ఉండగా రూ. 247 కోట్లే జమచేయగలిగామని, మిగతా మొత్తం రూ. 305.21 కోట్లను ఆగస్టు 12 నాటికి డిపాజిట్‌ చేస్తామని పేర్కొన్నారు. అయితే సెప్టెంబర్‌ 7 నాటికి కట్టాల్సిన రూ. 1,500 కోట్లలో దీన్ని కూడా లెక్కవేసి కట్టాలంటూ సుప్రీం కోర్టు సూచించింది.

మరిన్ని వార్తలు