బ్లాక్ మండే...

27 Jul, 2015 23:32 IST|Sakshi
బ్లాక్ మండే...

కుప్పకూలిన సూచీలు; మూడో రోజూ నష్టాలే..
551 పాయింట్ల పతనంతో 27,561కు సెన్సెక్స్   
161 పాయింట్లు క్షీణించి 8,361కు నిఫ్టీ
 
సూచీలు ఎందుకు పడ్డాయంటే...
- పీ-నోట్ల కట్టడికి సిట్ సూచనలు
- చైనా షాంఘై సూచీ 9 శాతం క్షీణించడం
- కంపెనీల జూన్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండడం
- మరో మూడు రోజుల్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల ముగింపు
- రూపాయి క్షీణించడం
- సంస్కరణలపై అనిశ్చితి
- ఫెడ్ వడ్డీరేట్ల పెంపు భయాలు
- వచ్చే వారమే ఆర్‌బీఐ రివ్యూ
- కమోడిటీల ధరలు తగ్గుతుండటం


సుప్రీం కోర్టు నల్లధనంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పీ నోట్లపై చేసిన సిఫార్సులు సోమవారం(మండే) స్టాక్ మార్కెట్లో మంటలు పుట్టించాయి. దీనికి చైనా షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ 8 శాతానికి పైగా పతనం కావడం తోడవడంతో  సోమవారం భారత స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 551 పాయింట్లు క్షీణించి 27,561 పాయింట్ల వద్ద, నిఫ్టీ 161 పాయింట్లు నష్టపోయి  8,361 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది ఐదు వారాల కనిష్టస్థాయి. జూన్ 2 తర్వాత సెన్సెక్స్ ఒక్క రోజులో ఇంత భారీగా పతనం కావడం ఇదే తొలిసారి. సిట్ సూచనలపై ఆర్థిక మంత్రి చెప్పిన ఉపశమన మాటలు సైతం ఇన్వెస్టర్లకు ఉపశమనం కలిగించలేకపోయింది.
 
అమ్మకాల సునామీ...
పీ నోట్లు, చైనా పతనం, కంపెనీల ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగా ఉండడం, సంస్కరణలపై అనిశ్చితి, జూలై నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో మూడు రోజుల్లో ముగియనుండడం.. ఇవన్నీ మార్కెట్ పతనంపై ప్రభావం చూపాయని, రెండు రోజుల పాటు జరగనున్న  ఫెడరల్ రిజర్వ్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానుండడం దీన్ని ఎగదోసిందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అభిప్రాయపడ్డారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచుతుందన్న ఆందోళనలు, కమోడిటీ ధరలు కరిగిపోవడం అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లను పడదోశాయన్నారు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో సైతం  లోహ, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, విద్యుత్తు, రియల్టీ, వాహన, ఆయిల్- గ్యాస్, ఐటీ... అన్ని రంగాల సూచీలూ నేల చూపులే చూశాయి.
 
చైనా షాంఘై షాక్...

చైనా షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ 9.2  శాతం (345 పాయింట్లు) పతనమై 3,726 పాయింట్లకు క్షీణించింది. ఒక్క రోజులో ఈ సూచీ ఇన్ని పాయింట్లు నష్టపోవడం ఎనిమిదేళ్లలో ఇదే తొలిసారి. ఈ పతనాన్ని నిరోధించడానికి చైనా ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నా అవి ఫలితాలనివ్వలేదు. ఇది ఆసియా మార్కెట్లపై ప్రభావం చూపింది.  

మన మార్కెట్లలో 30 సెన్సెక్స్ షేర్లలో ఒక్క బజాజ్ ఆటో మాత్రమే లాభపడింది. టాటా స్టీల్ 5.17%, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, లార్సెన్ అండ్ టుబ్రో, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, లుపిన్, ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్, భెల్‌లు 2-4% శ్రేణిలో నష్టపోయాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.2,961 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.16,417 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.4,08,520 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.860 కోట్ల నికర అమ్మకాలు జరపగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.239 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. సెన్సెక్స్ పతనంతో ఇన్వెస్టర్ల సంపద రూ.1.50 లక్షల కోట్లు ఆవిరైంది. బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 102 లక్షల కోట్లకు తగ్గింది.

>
మరిన్ని వార్తలు