ఎప్పట్లోగా కడతారో చెప్పండి..

12 Jun, 2020 04:32 IST|Sakshi

ప్రణాళిక సమర్పించండి... గ్యారంటీలివ్వండి...

ఏజీఆర్‌ బాకీలపై టెల్కోలకు సుప్రీం కోర్టు ఆదేశం

తదుపరి విచారణ 18కి వాయిదా

జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్న వొడా–ఐడియా

న్యూఢిల్లీ: లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలకు సంబంధించిన (ఏజీఆర్‌) బకాయీలను ఎప్పట్లోగా, ఎలా చెల్లిస్తారో స్పష్టమైన ప్రణాళిక సమర్పించాలంటూ టెలికం సంస్థలను సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే పూచీకత్తులు కూడా ఇవ్వాలని సూచించింది. టెల్కోలు కట్టాల్సిన ఏజీఆర్‌ బాకీలపై గురువారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. బాకీలు కట్టేందుకు టెల్కోలకు 20 ఏళ్ల గడువు ఇచ్చే అంశంపై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. 1999 నుంచి కేసు నలుగుతోందని.. ఈ 20 ఏళ్లలో బాకీలు కట్టనప్పుడు మరో 20 ఏళ్లలో కట్టేస్తారనడానికి గ్యారంటీ ఏమిటని టెల్కోలను ప్రశ్నించింది.

వాయిదాల పద్ధతిలో కట్టుకోవడానికి కోర్టు అనుమతించే పరిస్థితి లేదని.. బ్యాంక్‌ గ్యారంటీలివ్వడానికి టెల్కోలు, వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వడానికి ఆయా సంస్థల డైరెక్టర్లు గానీ సిద్ధంగా ఉన్నారేమో తెలియజేయాలని సూచించింది. తదుపరి విచారణను జూన్‌ 18కి వాయిదా వేసింది. సవరించిన ఆదాయాల ఫార్ములా ప్రకారం టెల్కోలు బాకీలు కట్టేలా సుప్రీం కోర్టు గతేడాది అక్టోబర్‌లో ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. టెలికం శాఖ లెక్కల ప్రకారం భారతి ఎయిర్‌టెల్‌ రూ. 43,980 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ. 58,254 కోట్లు, టాటా గ్రూప్‌ రూ. 16,798 కోట్లు కట్టాల్సి ఉంది. అయితే, టెల్కోలు తమ బాకీలు ఆ స్థాయిలో లేవని చెబుతున్నాయి. స్వీయ మదింపు ప్రకారం ఇప్పటికే కొంత కట్టాయి. ఇది పోగా మిగతా రూ. 93,520 కోట్ల ఏజీఆర్‌ బాకీలను టెల్కోలు కట్టేందుకు 20 ఏళ్ల దాకా వ్యవధినిచ్చేందుకు అనుమతించాలంటూ సుప్రీం కోర్టును కేంద్రం కోరింది.  

స్పెక్ట్రమే గ్యారంటీ..: వొడాఫోన్‌ ఐడియా తీవ్ర సంక్షోభంలో ఉందని, ఉద్యోగులకు కనీసం జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదని విచారణ సందర్భంగా ఆ సంస్థ తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్‌గీ సుప్రీం కోర్టుకు తెలిపారు.  టెలికం సంస్థలు వేల కోట్ల రూపాయలు చెల్లించి వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రం, లైసెన్సులనే ప్రభుత్వం గ్యారంటీగా పరిగణించవచ్చని ఆయన చెప్పారు. ఒకవేళ టెల్కోలు బాకీలు కట్టకపోతే వీటిని రద్దు చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. మరోవైపు,  స్వీయ మదింపు ప్రకారం ఇప్పటికే 70% కట్టేశామని, ప్రభుత్వంతో సంప్రతించాకా మిగతాది కూడా కట్టేస్తామని భారతి ఎయిర్‌టెల్‌ తెలియజేసింది.

పీఎస్‌యూలపై ఆ బాదుడేంటి..
ఇక ఏజీఆర్‌ బాకీలపై గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రాతిపదికన ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) నుంచి రూ. 4 లక్షల కోట్ల బాకీలు రాబట్టేందుకు టెలికం శాఖ చర్యలు తీసుకోవడాన్ని కూడా సుప్రీం కోర్టు ప్రశ్నించింది. పీఎస్‌యూలనుంచి బాకీలు రాబట్టేందుకు తమ ఉత్తర్వును ప్రాతిపదికగా తీసుకోవడానికి లేదని పేర్కొంది. ‘ఈ డిమాండ్‌ నోటీసులను వెనక్కి తీసుకోండి. లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది‘ అని స్పష్టం చేసింది. గతేడాది అక్టోబర్‌లో ఏజీఆర్‌ బాకీలపై సుప్రీం ఆదేశాల ప్రకారం.. స్పెక్ట్రం, లైసెన్సులున్న గెయిల్, పవర్‌గ్రిడ్, ఆయిల్‌ ఇండియా మొదలైన పీఎస్‌యూలు రూ. 4 లక్షల కోట్లు కట్టాలంటూ టెలికం శాఖ లెక్కేసింది. దీనిపై ఆయా సంస్థలు కోర్టును ఆశ్రయించాయి.

>
మరిన్ని వార్తలు