జెట్‌ సంక్షోభంపై స్పందించిన సురేష్‌ ప్రభు

12 Apr, 2019 13:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సంక్షోభంలో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిసారించాలని పౌర విమానయాన కార్యదర్శి ప్రదీప్‌ సింగ్‌ ఖరోలాను పౌర విమానయాన మంత్రి సురేష్‌ ప్రభు శుక్రవారం ఆదేశించారు. ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా, వారి భద్రతను పరిగణనలోకి తీసుకుంటూ  జెట్‌ ఎయిర్‌వేస్‌లో సమస్యలను చక్కదిద్దేందుకు చొవర చూపాలని పౌర విమానయాన కార్యదర్శి ఖరోలాను ఆదేశిస్తూ మం‍త్రి సురేష్‌ ప్రభు ట్వీట్‌ చేశారు.

మరోవైపు సమస్యలు చుట్టుముట్టడంతో విమానాల సంఖ్యను, సేవలను తగ్గిస్తున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ కేవలం 9 విమానాలనే నడుపుతోంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ గురువారం తూర్పు, ఈశాన్య ప్రాంతాలకు విమాన సర్వీసులను నిలిపివేసింది. రోజంతా అంతర్జాతీయ సేవలను రద్దు చేసింది. జెట్‌ చర్యతో పెద్దసంఖ్యలో ప్రయాణీకులు పలు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. జెట్‌ ఇబ్బందులు ప్రస్తుతం ఏ స్ధాయిలో ఉన్నాయంటే విమాన సర్వీసులు రద్దవడంతో కేవలం ప్రయాణీకులకే సంస్థ రూ 3500 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైంది.

>
మరిన్ని వార్తలు