ఆ పాస్‌పోర్ట్‌ యాప్‌ సూపర్‌ హిట్‌!

29 Jun, 2018 17:13 IST|Sakshi
సుష్మా స్వరాజ్‌ (ఫైల్‌ ఫొటో)

న్యూఢిల్లీ : దేశంలో ఎక్కడి నుంచైనా పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునేలా కేంద్రం తీసుకొచ్చిన ‘ఎం పాస్‌పోర్ట్‌ సేవ యాప్‌’  కు విశేష స్పందన లభిస్తోంది. ఈ యాప్‌ను ఆవిష్కరించిన రెండురోజుల్లోనే ఒక మిలియన్‌ మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ ట్విటర్‌లో స్పష్టం చేశారు. ‘ఇటీవల విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆవిష్కరించిన పాస్‌పోర్ట్‌ సేవ మొబైల్‌ యాప్‌ను అప్పుడే 1 మిలియన్‌ మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.’ అని ఆమె ట్వీట్‌ చేశారు.

ఆరో పాస్‌పోర్ట్‌ సేవా దివస్‌ సందర్భంగా సుష్మా స్వరాజ్‌ గత మంగళవారం ఈ మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. పాస్‌పోర్టు దరఖాస్తు, ఫీజు చెల్లింపు, అపాయింట్‌మెంట్‌ షెడ్యూల్‌ తదితర సౌకర్యాలను ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా పొందవచ్చు. ఈ విధానం కింద .. పాస్‌పోర్ట్‌ దరఖాస్తు సమర్పించేందుకు రీజినల్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయం(ఆర్‌పీఓ), పాస్‌పోర్ట్‌ సేవా కేంద్ర(పీఎస్‌కే) లేదా పోస్టాఫీస్‌ పాస్‌పోర్ట్‌ సేవా కేంద్ర(పీఓపీఎస్‌కే)లలో దేన్నైనా ఎంచుకోవచ్చు. ఎంచుకున్న ఆర్‌పీఓ పరిధిలో దరఖాస్తుదారుడి నివాస స్థలం లేకున్నా కూడా అప్లికేషన్‌ పంపొచ్చు. దరఖాస్తు ఫారంలో పేర్కొన్న చిరునామాలోనే పోలీసు ధ్రువీకరణ జరుగుతుంది. పాస్‌పోర్టు మంజూరు అయిన తరువాత.. సదరు ఆర్‌పీఓనే దరఖాస్తులోని చిరునామాకు దాన్ని పంపుతుంది.

మరిన్ని వార్తలు