కేంద్రానికి ‘ఐటీసీ’ పంట!

8 Feb, 2017 00:40 IST|Sakshi
కేంద్రానికి ‘ఐటీసీ’ పంట!

2 శాతం వాటా విక్రయం
రూ.6,700 కోట్లు సమీకరణ
వాటా కొనుగోలు చేసిన ఎల్‌ఐసీ
...  

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి ‘ఐటీసీ’ పంట పండింది. ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్‌లో 2 శాతం వాటాను విక్రయించడం ద్వారా ఖజానాలోకి ఏకంగా రూ.6,700 కోట్లు వచ్చిపడ్డాయి. స్పెసిఫైడ్‌ అండర్‌టేకింగ్‌ ఆఫ్‌ ద యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌యూయూటీఐ) నుంచి ఈ వాటాను కేంద్రం మంగళవారం విక్రయించింది. బ్లాక్‌ డీల్స్‌ రూపంలో జరిగిన ఈ లావాదేవీలో మొత్తం 2 శాతం వాటాను ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ‘కేంద్రం ఒక్కో షేరుకు ఆఫర్‌ చేసిన రూ.275.85 ధరకు ఎల్‌ఐసీ ఈ వాటాను దక్కించుకుంది. ఈ డీల్‌తో ప్రభుత్వానికి దాదాపు రూ.6,700 కోట్లు లభించాయి’ అని ఆయా వర్గాలు వెల్లడించాయి.

ఇంకా 9.17 శాతం కేంద్రం వద్దే...
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా(యూటీఐ) నుంచి కొన్ని ఆస్తులు, అప్పులను టేకోవర్‌ చేసుకొని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థే ఎస్‌యూయూటీఐ. వివిధ ప్రైవేటు రంగ కంపెనీల్లో ఉన్న వాటాల్లో చాలా వరకూ ఎస్‌యూయూటీఐ ద్వారానే కేంద్రం కలిగి ఉంది. ప్రస్తుతం ఐటీసీలో దీనికి 11.17 శాతం వాటా ఉండగా.. తాజాగా 2 శాతం వాటా విక్రయం తర్వాత ఇది 9.17 శాతానికి తగ్గింది. కాగా, ఐటీసీతో పాటు మొత్తం 51 కంపెనీల్లో ఎస్‌యూయూటీఐకి వాటాలున్నాయి. ఇందులో ఎల్‌ అండ్‌ టీలో 6.53 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌లో 11.53 శాతం వాటాలు ప్రధానమైనవి.

ఈ కంపెనీల్లో కొంత వాటాలను విక్రయించడం కోసం కేంద్రం మూడేళ్ల ప్రణాళికను నిర్ధేశించింది. ఈ ప్రక్రియ కోసం ఇప్పటికే మర్చెంట్‌ బ్యాంకర్లను కూడా నియమించింది. ఇందులో భాగంగా గతేడాది నవంబర్‌లో ఎల్‌ అండ్‌ టీలో 1.63 శాతం, యాక్సిస్‌లో 9 శాతం చొప్పున వాటాలను విక్రయించింది. దీని ద్వారా రూ.5,500 కోట్లను సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)ల్లో వాటా అమ్మకాల ద్వారా రూ.45,000 కోట్లను సమీకరించాలనేది ప్రభుత్వ లక్ష్యం(సవరించిన అంచనాల ప్రకారం). ఇందులో ఇప్పటివరకూ 12 లావాదేవీల ద్వారా దాదాపు రూ. 39,000 కోట్లు ఖజానాలోకి చేరాయి.

ఆల్‌టైమ్‌ గరిష్టానికి ఐటీసీ షేరు..
ప్రభుత్వ వాటా విక్రయం నేపథ్యంలో ఐటీసీ షేరు దూసుకెళ్లింది. మంగళవారం బీఎస్‌ఈలో ఒకానొక దశలో 5.6 శాతం ఎగబాకి ఆల్‌టైమ్‌ గరిష్టాన్ని(రూ.291.95) తాకింది. అయితే, చివరకు స్వల్ప లాభంతో(0.25%) రూ.277.10 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్‌ విలువ(క్యాపిటలైజేషన్‌) రూ. రూ.3,36,015 కోట్లకు చేరింది.

కొత్త ఈటీఎఫ్‌లో సర్కారీ బ్యాంకులు, ఎయూయూటీఐ వాటా
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్‌ఈ)లకు సంబంధించిన రెండో ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌(ఈటీఎఫ్‌)పై మోదీ సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2017–18)లో ప్రారంభించనున్న కొత్త ఈటీఎఫ్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు, గతంలో పీఎస్‌యూలుగా ఉన్న లిస్టెడ్‌ కంపెనీల్లోని వాటాలతోపాటు ఎస్‌యూయూటీఐ ద్వారా వివిధ కంపెనీల్లో ఉన్న వాటాలను కూడా చేర్చాలని ఆర్థిక శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం. పది పీఎస్‌యూలకు(ఓఎన్‌జీసీ, గెయిల్, కోల్‌ ఇండియా, ఇండియన్‌ ఆయిల్, ఆయిల్‌ ఇండియా, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్, రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్, కంటెయినర్‌ కార్పొరేషన్, ఇంజినీర్స్‌ ఇండియా, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌) చెందిన షేర్లతో 2014లో ఏర్పాటు చేసిన తొలి సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ మెరుగైన పనితీరును కనబరుస్తుండటంతో రెండో ఈటీఎఫ్‌ కోసం పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం(దీపమ్‌) ప్రయత్నాలు చేస్తోంది.

ఇందులో ఏ కంపెనీల షేర్లను చేర్చాలనేది పరిశీలిస్తోంది. గతంలో పీఎస్‌యూలుగా ఉన్న హిందుస్థాన్‌ జింక్‌ వంటి కంపెనీల్లో ప్రభుత్వానికి ఉన్న మైనారిటీ వాటాను రెండో ఈటీఎఫ్‌లో చేర్చే అవకాశం ఉందని ఆర్థిక శాఖకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. తొలి ఈటీఎఫ్‌ దాదాపు మూడేళ్లలో 14.4 శాతం రాబడిని అందించినట్లు ఆయన వెల్లడించారు. 2014 మార్చిలో ఆరంభం సందర్భంగా దీని ద్వారా ప్రభుత్వం రూ.3,000 కోట్లను సమీకరించింది. తాజాగా గత నెలలో రెండో దశలో రూ.6,000 కోట్లు ఖజానాకు లభించాయి. కాగా, రెండో సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ నిర్వహణ కోసం ఇప్పటికే ఆర్థిక శాఖ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ను ఎంపిక చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2017–18)లో కొత్త సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ను ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తాజా బడ్జెట్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు