తరాలు మారినా... మిఠాయిదే పైచేయి!

18 Oct, 2014 01:03 IST|Sakshi
తరాలు మారినా... మిఠాయిదే పైచేయి!

న్యూఢిల్లీ: దీపావళి పండుగ అంటే చెప్పేదేముంటుంది. చాక్లెట్లు, మిఠాయిల షాపులు కస్టమర్లతో కళకళలాడిపోతుంటాయి. రేటెంతయినా ఈ పండుగ రోజు స్వీట్స్‌కు ఉండే డిమాండే వేరు. తమ ఇంట్లోకే కాకుండా బంధువులకు, స్నేహితులకు సైతం స్వీట్స్ పంపే, పంచే ప్రత్యేక పండుగ ఇది. షాపులకు వెళ్లామంటే- పలు రకాల మిఠాయిలు, చాక్లెట్ల ‘రుచులు’ ఊరించేస్తుంటాయి. పలు రకాలు చాక్లెట్లు, వివిధ స్వీట్లు కలర్‌ఫుల్ ప్యాకెట్లలో ఆకర్షిస్తుంటాయి.

అయితే ఆకర్షణీయమైన ప్యాకెట్లలో దిగుమతయ్యే చాక్లెట్లు, ఫ్యాన్సీ కుకీలు, కేకులు, ముఫిన్స్ ఎంత పోటీ ఇస్తున్నా... మన భారత సాంప్రదాయక మిఠాయిలతో అవి పోటీ పడలేకపోతుండడమే విశేషం. ఇండస్ట్రీ చాంబర్ అసోచామ్ అంచనా ప్రకారం మొత్తం ఈ మార్కెట్ విలువ దాదాపు రూ.49,000 కోట్లు (8 బిలియన్ డాలర్లలో).
 
సాంప్రదాయక స్వీట్ల హవా!
మన సాంప్రదాయక మిఠాయిలు మార్కెట్‌లో తన పట్టును కాపాడుకోవడమే కాకుండా, విస్తరిస్తున్న మార్కెట్‌కు అనుగుణంగా వీటి విక్రయాలు సైతం పెరుగుతున్నాయి. ఇక్కడ మన మిఠాయిల కొనుగోళ్ల పట్ల కస్టమర్లకు ఉన్న భావోద్వేగ అంశాలు సైతం కీలకంగా మారినట్లు షాపుల యజమానులు తెలుపుతున్నారు. జీడిపప్పు పౌండర్, చక్కెరతో తయారుచేసే స్వీట్ కేక్  కాజు కట్లీసహా మైసూర్‌పాక్, బాదమ్ హల్వా, గులాబ్ జామ్ వంటి స్వీట్స్ మార్కెట్‌లో తమ హవాను చాటుతున్నాయి. కొన్ని స్వీట్స్ కొనేముందు అవి కనీసం కొన్ని రోజులు అలమరాల్లో మన్నే విషయాన్ని సైతం తమ కొనుగోళ్ల సందర్భంగా కస్టమర్లు పరిగణనలోకి తీసుకుంటారని వర్తకులు పేర్కొంటున్నారు.

ఆయా అంశాల్లోసైతం మన సాంప్రదాయ మిఠాయిలకే ప్రాధాన్యత, ప్రత్యేకత ఉంటోందని ఈ రంగంలో నిపుణుల మాట. బ్రాండెడ్ స్వీట్స్ మార్కెట్ గత యేడాదితో పోల్చితే ప్రస్తుత దీపావళికి 30 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు ఈ రంగంలో నిపుణులు పేర్కొంటున్నారు. మిఠాయివాలా డాట్ ఇన్ వెబ్‌సైట్ 400 రకాల బ్రాండెడ్ స్వీట్‌ను ఆఫర్ చేస్తోంది. మన స్వీట్స్‌కు డిమాండ్ మరింత పెరిగేదని, అయితే సాంప్రదాయక స్వీట్లలో కల్తీ భయాందోళన కలిగిస్తోందని ఈ రంగంలో నిపుణులు తెలిపారు. దీనితో చాక్లెట్లవైపు కొందరు కస్టమర్లు మొగ్గుచూపుతుండడం గమనార్హం. ప్రస్తుతం భారత చాక్లెట్ పరిశ్రమల పరిమాణం రూ.5,000 కోట్లు. ఇది వచ్చే రెండేళ్లలో రూ.7,500 కోట్లు దాటుతుందని అంచనా.

>
మరిన్ని వార్తలు