రూ.1,430 కోట్లు  సమీకరించిన స్విగ్గీ 

22 Jun, 2018 01:03 IST|Sakshi

ఇది జి సిరీస్‌ ఫండింగ్‌ ఆఫర్లు కొనసాగిస్తాం  

స్విగ్గీ సీఈఓ శ్రీహర్ష మాజేటి వెల్లడి

న్యూఢిల్లీ: ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫార్మ్‌ స్విగ్గీ...తాజాగా రూ.1,430 కోట్ల(21 కోట్ల డాలర్లు) పెట్టుబడులను సమీకరించింది. జి సిరీస్‌ ఫండింగ్‌లో భాగంగా నాస్పర్స్‌ వెంచర్స్, డీఎస్‌టీ గ్లోబల్‌ సంస్థల నేతృత్వంలో ఈ పెట్టుబడులను సమీకరించామని స్విగ్గీ సీఈఓ శ్రీహర్ష మాజేటి చెప్పారు. ప్రస్తుత వాటాదారులైన మీటువాన్‌–డియాన్‌పింగ్‌తో  పాటు కొత్తగా కోట్యూ మేనేజ్‌మెంట్‌ కూడా పెట్టుబడులు పెట్టిందని వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సిరీస్‌ ఎఫ్‌ ఫండింగ్‌లో భాగంగా పది కోట్ల డాలర్లు సమీకరించామని పేర్కొన్నారు.  

టెక్నాలజీ సిబ్బంది రెట్టింపు.. 
ఇక తాజా పెట్టుబడులలో ఆఫర్ల విస్తరణను కొనసాగిస్తామని, సప్లై చెయిన్‌ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేస్తామని, కొత్త మార్కెట్లలోకి ప్రవేశిస్తామని శ్రీహర్ష చెప్పారు. వినియోగదారులకు మరింత సంతృప్తికరమైన సేవలందించడానికి గాను కీలకమైన అంశాలపై ఇన్వెస్ట్‌ చేస్తామని వివరించారు. సేవల విస్తరణలో భాగంగా టెక్నాలజీ విభాగంలో సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేయనున్నామని పేర్కొన్నారు.  తాజా పెట్టుబడులతో భారత్‌లో అత్యధికంగా పెట్టుబడులు పొందిన ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫార్మ్‌గా స్విగ్గీ నిలిచిందని నాస్పర్స్‌ వెంచర్స్‌ సీఈఓ లారీ లిగ్‌ వెల్లడించారు. స్విగ్గీ జోరుగా వృద్ధిని సాధిస్తోందని డీఎస్‌టీ గ్లోబల్‌  ఎమ్‌డీ సౌరభ్‌ గుప్తా వ్యాఖ్యానించారు.  2014లో ఆరంభమైన స్విగ్గీ  ప్రస్తుతం 15 నగరాల్లో  35,000 రెస్టారెంట్‌ పార్ట్‌నర్స్, 40,000 మంది డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.  

  

మరిన్ని వార్తలు