పెద్ద ఆయిల్‌ కంపెనీ వచ్చేస్తోంది!

2 Feb, 2017 01:39 IST|Sakshi
పెద్ద ఆయిల్‌ కంపెనీ వచ్చేస్తోంది!

చమురు పిఎస్‌యుల విలీనం దిశగా అడుగులు
పూర్తయితే రోజ్‌నెఫ్ట్, బిపి బలాదూర్‌
బడ్జెట్లో ప్రతిపాదించిన ప్రభుత్వం


న్యూఢిల్లీ: దేశీయ చమురు అవసరాలు తీర్చగలిగేలా, అంతర్జాతీయ చమురు దిగ్గజాలైన రోజ్‌నెఫ్ట్, బిపి, చెవరాన్‌ను తలదన్నేలా ఒక భారీ చమురు కంపెనీ ఏర్పాటు చేయాలని కేంద్రం సంకల్పించింది. ఇందుకోసం ప్రస్తుతం దేశంలో ఉన్న 13 చమురు పిఎస్‌యులన్నింటినీ, లేదా కొన్నింటినీ విలీనం చేయాలని భావిస్తోంది. నిజానికి ఇలాంటి భారీ దిగ్గజ చమురు కంపెనీ ఏర్పాటు చేయాలని పుష్కర కాలం నుంచి ప్రతిపాదనలున్నాయి. అప్పట్లో నాటి చమురు శాఖా మంత్రి మణిశంకర్‌ అయ్యర్‌ తొలిసారి ఈ ప్రతిపాదన చేశారు.  హెచ్‌పీసీఎల్, బిపీసీఎల్‌ను ఓఎన్‌జీసితో, ఓఐఎల్‌ను ఐఒసితో విలీనం చేసి రెండు దిగ్గజ కంపెనీలను ఏర్పాటు చేయాలని 2004లో అప్పటి చమురు మంత్రి అయ్యర్‌ ప్రతిపాదించారు. దీంతోపాటు పిఎస్‌యుల అనుబంధ సంస్థలను మాతృ సంస్థతో విలీనం చేయాలన్నారు.

అయితే ఆ సమయంలో చమురు ధరలు అంతర్జాతీయంగా పెరుగుతుండడంతో విలీనం ప్రతిపాదనల వద్దే నిలిచిపోయింది. ఈ ప్రతిపాదనలనకు కార్యరూపాన్ని తాజా బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ చమురు దిగ్గజాలను, దేశీయంగా ఉన్న భారీ ప్రైవేట్‌ చమురు సంస్థలను దీటుగా ఎదుర్కొనే ఒక దిగ్గజ చమురు పిఎస్‌యు ఏర్పాటుపై సన్నాహాలు జరుపుతున్నామని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. దేశీ ప్రభుత్వ రంగంలో ప్రస్తుతం చమురు ఉత్పతి సంస్థలు ఓఎన్‌జీసి, ఓఐఎల్, మార్కెటింగ్‌ సంస్థలు బిపిసిఎల్, హెచ్‌పిసిఎల్, సహజవాయువు రవాణా సంస్థ గెయిల్, ఇంజనీరింగ్‌ కార్యకలాపాలు నిర్వహించే ఇంజనీర్స్‌ఇండియా తదితర కంపెనీలున్నాయి. క్షీణించిన చమురు ధరల వల్ల ఎదురవుతున్న నష్టాలను తట్టుకొని, ప్రపంచస్థాయిలో పోటీ పడే ఒక పెద్ద సంస్థ ఏర్పాటు చేయాలని కొన్ని నెలల క్రితమే ప్రభుత్వం యోచన ఆరంభించింది.

ప్రస్తుతం ప్రభుత్వ రంగంలోని టాప్‌ ఎనిమిది చమురు కంపెనీల సామూహిక మార్కెట్‌ విలువ 8000 కోట్ల డాలర్లు. తాజాగా ఏర్పాటు చేయప్రతిపాదిస్తున్న కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రష్యాకు చెందిన రోజ్‌నెఫ్ట్, అంబానీకి చెందిన రిలయన్స్‌ మార్కెట్‌ విలువ కన్నా చాలా ఎక్కువగా ఉండనుంది. ఇంచుమించు ఈ కంపెనీ మార్కెట్‌క్యాప్‌ బ్రిటన్‌కు చెందిన బిపి సంస్థ మార్కెట్‌ విలువకు దగ్గరగా ఉంటుందని అంచనా. 2015–16లో అన్ని చమురు పిఎస్‌యులు కలిసి రూ. 45,500 కోట్ల రూపాయల లాభాన్ని, రూ. 9.32 లక్షల కోట్లరూపాయల ఆదాయాన్ని నమోదు చేశాయి.

కన్సాలిడేషన్లతో పిఎస్‌యుల బలోపేతం
కొనుగోళ్లు, విలీనాలు, కన్సాలిడేషన్ల ద్వారా దేశీయ పిఎస్‌యులను బలోపేతం చేసే అవకాశం ఉంటుందని జైట్లీ అభిప్రాయపడ్డారు. చమురు, సహజవాయు రంగంలో ఇలాంటి కన్సాలిడేషన్, విలీనానికి అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. పిఎస్‌యులను బలోపేతం చేసినప్పుడే అవి భారీ రిస్కులను ఎదుర్కొనే సత్తా పొందుతాయని, భారీ పెట్టుబడి నిర్ణయాలు తీసుకోగలుగుతాయని అన్నారు. అయితే పీఎస్‌యుల పునర్యవస్థీకరణపై ఏర్పాటైన హైలెవల్‌ కమిటీ ఇలాంటి విలీన ప్రతిపాదనను వ్యతిరేకించింది.

ఇలా ఏకీకృత కంపెనీ ఏర్పాటు చేసే బదులు ఉన్న వాటికి మరింత స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని సూచించింది. ఇందుకోసం పీఎస్‌యుల్లో ప్రభుత్వ వాటాలను ఒక ట్రస్ట్‌కు బదిలీ చేసి నిర్వహించేలా చూడాలని పేర్కొంది. ప్రపంచం చమురు రంగంలో ధరలు క్షీణించినప్పుడు జరిగిన విలీనాలన్నీ వ్యయాలు తగ్గించుకునేందుకు జరిగినవేనని కమిటీ అభిప్రాయపడింది. ప్రస్తుత దేశీయ చమురు పిఎస్‌యుల్లో ఒఎన్‌జిసి అతిపెద్ద ఉత్పత్తిదారు కాగా ఐఓసి అతిపెద్ద రిఫైనరీ, గెయిల్‌ అతిపెద్ద గ్యాస్‌ పైప్‌లైన్‌ సొంతదారు.

మరిన్ని వార్తలు