ఇష్టం ఉంటే...ఎంట్రన్స్‌లు ఈజీనే!

18 Feb, 2017 01:24 IST|Sakshi
రావుల, శివరాం, మాలతీరావు (ఎడమ నుంచి)

‘వావ్‌విన్‌’లో నీట్, జీఈఈ, ఎంసెట్‌ సిలబస్‌లు
4 సబ్జెక్టుల్లో లక్షకు పైగా ప్రశ్నలు
వీక్‌ సబ్జెక్ట్‌ల టెస్టులే తీసుకోవచ్చు
స్టార్టప్‌డైరీతో వ్యవస్థాపకుడు శివరాం  


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సాధారణ విద్యార్థులు నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో నెగ్గాలంటే కఠోర సాధన తప్పనిసరి. అయితే విద్యార్థికి నేర్చుకోవాలనే ఆసక్తి కల్పిస్తే సులువుగానే పరీక్షలో విజయం సాధించొచ్చంటోంది వావ్‌ విన్‌. అదే లక్ష్యంతో గత నవంబర్లో ‘వావ్‌విన్‌.ఇన్‌’ పేరిట ఆన్‌లైన్‌ ప్రిపరేషన్‌ సంస్థ ప్రారంభమయింది. దీనిద్వారా ఎలా ప్రిపేర్‌ కావాలి? ఎందరు ప్రిపేరవుతున్నారు? ఎందరు విజయం సాధించారు? వంటి విషయాలన్నీ స్టార్టప్‌ డైరీతో పంచుకున్నారు సంస్థ వ్యవస్థాపకుడు శివరాం మల్లెల. 1984లో ప్రారంభమైన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ ఫైనాన్షియల్‌ అనలిస్ట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎఫ్‌ఏఐ) వ్యవస్థాపకుల్లో ఒకరైన శివరాం చెప్పిన వివరాలివీ...

నీట్, ఐఐటీజేఈ, ఎంసెట్‌ పరీక్షలకు సంబంధించిన గణితం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం నాలుగు సబ్జెక్ట్‌ల సిలబస్‌ ఉంటుంది. ప్రముఖ శిక్షణ సంస్థలు, వర్సీటీల నుంచి సుమారు 40 మంది ప్రొఫెసర్ల బృందంతో ఈ సిలబస్‌ను రూపొందించాం. ప్రిపరేషన్‌ మెటీరియల్, క్వశ్చన్‌ బ్యాంక్, మాక్‌ టెస్ట్‌ల వంటివి నిర్వహిస్తాం. ప్రతి విద్యార్థికీ ప్రత్యేకంగా లాగిన్, పాస్‌వర్డ్‌ ఇస్తాం. దీంతో విద్యార్థి ఎక్కడైనా సరే ప్రవేశ పరీక్షలకు సిద్ధం కావచ్చు.
సబ్జెక్టులోని ప్రతి అంశాన్ని చాప్టర్లుగా, సబ్‌ చాప్టర్లుగా విభజించి లోతుగా విశ్లేషిస్తాం. ఒక్కో సబ్‌ చాప్టర్‌ నుంచి కనీసం 1,000–1,500 ప్రశ్నలుంటాయి. ప్రస్తుతానికి వావ్‌విన్‌లో లక్షకు పైగా ప్రశ్నలున్నాయి. విద్యార్థులు వారికి నచ్చిన అంశాన్ని ఎంచుకుని చదువుకోవచ్చు. వాటిపైనే టెస్ట్‌లు పెట్టుకోవచ్చు. ఏ అంశంలోనైతే వీక్‌గా ఉన్నారో అందులో మరింత శిక్షణ ఉంటుంది.
నీట్, జేఈఈ పరీక్షల్లాగే ప్రతి మాక్‌ టెస్ట్‌ను 180 నిమిషాల్లో పూర్తి చేయాలి. దీంతో విద్యార్థికి నిజంగా పరీక్ష రాసే సమయంలో ఎలాంటి తత్తరపాటూ ఉండదు. పరీక్ష అనంతరం విద్యార్థికి ఫలితాలు వెల్లడిస్తాం. ఏ అంశంలో వీక్‌గా ఉన్నాడో చెబుతూ తగిన మెటీరియల్‌ ఇస్తాం. దీంతో అన్ని అంశాల్లోనూ విద్యార్థికి పూర్తి పరిజ్ఞానం వస్తుంది.
నాలుగు సబ్జెక్టుల్లో కలిపి ఒకో విద్యార్థికి ఏడాదికి రూ.2,500 చార్జీ చేస్తాం. మేలో నీట్‌ పరీక్ష ఉంటుంది. అప్పటివరకు సుమారు రూ.80 లక్షల వ్యాపారాన్ని చేరుతామనే నమ్మకం ఉంది.
మా సిలబస్‌ను తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌) విద్యార్థులకు శిక్షణ కోసం అడుగుతోంది. దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఆగస్టు నాటికి గేట్, క్యాట్‌ ప్రవేశ పరీక్షల సిలబస్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తాం.

అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్‌ చేయండి...

మరిన్ని వార్తలు