వేలానికి జీవీకే గ్రూప్‌ ‘సెజ్‌’

11 Mar, 2017 01:00 IST|Sakshi
వేలానికి జీవీకే గ్రూప్‌ ‘సెజ్‌’

సిద్ధమైన సిండికేట్‌ బ్యాంకు
రూ.175 కోట్లు బాకీపడ్డ కంపెనీ


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీవీకే గ్రూప్‌కు సిండికేట్‌ బ్యాంక్‌ షాకిచ్చింది. రుణ రికవరీలో భాగంగా తమిళనాడులో 2,500 ఎకరాల్లో విస్తరించిన జీవీకే పెరంబలూరు సెజ్‌ స్థలాన్ని వేలానికి పెట్టింది. సిండికేట్‌ బ్యాంకుకు గ్రూప్‌ కంపెనీ జీవీకే పవర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రూ.175.08 కోట్లు బాకీ పడింది. సర్ఫేసీ యాక్ట్‌–2002 కింద రికవరీ కోసం బ్యాంకు ఈ మేరకు గురువారం పబ్లిక్‌ నోటీస్‌ జారీ చేసింది. రిజర్వ్‌ ప్రైస్‌ రూ.257 కోట్లుగా ఉంది. జనవరి 6న తొలిసారి నిర్వహించిన వేలానికి స్పందన రాలేదు. దీంతో మరోసారి మార్చి 27న ఈ–వేలానికి బ్యాంకు సిద్ధమైంది. 2015 డిసెంబరులో రూ.156.76 కోట్ల బాకీ చెల్లించాలంటూ నోటీసు ఇచ్చిన తర్వాత 2016 సెప్టెంబరు నుంచి 2017 ఫిబ్రవరి మధ్య జీవీకే పవర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రూ.8.9 కోట్లు మాత్రమే సిండికేట్‌ బ్యాంకుకు చెల్లించింది.

మరో రెండు బ్యాంకులు సైతం..
సిండికేట్‌ బ్యాంకుతోపాటు మరో రెండు బ్యాంకులు సైతం ఇదే సెజ్‌ స్థలంపై జీవీకే గ్రూప్‌ కంపెనీలకు రుణాలను మంజూరు చేశాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు జీవీకే ఎయిర్‌పోర్ట్‌ డెవలపర్స్‌కు రూ.1,078 కోట్లు అప్పు ఇచ్చింది. యాక్సిస్‌ బ్యాంకు జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రూ.205 కోట్లు రుణం అందించింది. కాగా, 2016 మార్చి నాటికి జీవీకే గ్రూప్‌ రుణ భారం రూ.32,290 కోట్లు ఉన్నట్టు సమాచారం. కంపెనీ 2015–16లో కన్సాలిడేటెడ్‌ నిర్వహణ ఆదాయం రూ.4,164 కోట్లపై రూ.1,212 కోట్ల నికర నష్టం ప్రకటించింది. వాటాల విక్రయం ద్వారా రుణ భారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్న జీవీకే గ్రూప్‌కు సిండికేట్‌ బ్యాంక్‌ చర్య ఇబ్బందికర పరిణామమని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి.

చెల్లిస్తామంటున్నారే తప్ప..
బాకీ విషయమై బ్యాంకుతో చర్చిస్తున్నామని జీవీకే అంటోంది. మొత్తం బాకీని కొన్ని వారాల్లో చెల్లిస్తామని మరీ చెబుతోంది. అయితే ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు తోసిపుచ్చారు. కంపెనీ ప్రతినిధులు బ్యాంకుతో చర్చిస్తున్నట్టు తనకు సమాచారం లేదని సిండికేట్‌ బ్యాంక్‌ కార్పొరేట్‌ కార్యాలయం ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. బాకీ చెల్లించే ప్రతిపాదన ఏదీ రాలేదని వెల్లడించారు. మొదటిసారి వేలం నోటీసు ఇచ్చినప్పుడు కూడా బాకీ తిరిగి చెల్లిస్తామని కంపెనీ చెప్పిందేగానీ, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లేవీ చేయలేదని ఆ అధికారి వ్యాఖ్యానించారు. సెజ్‌ స్థలాన్ని ఒకే యూనిట్‌గా విక్రయిస్తామని ఆయన పేర్కొన్నారు. బ్యాంకుకు రావాల్సిన మొత్తాన్ని స్వీకరిస్తాం. ఇతర రుణదాతలకు చెల్లించేందుకు వీలుగా మిగిలిన వేలం సొమ్మును కంపెనీకి ఇస్తాం అని ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు