పెట్టుబడుల ఉపసంహరణ: ఆ కంపెనీలపై కొరడా

9 Oct, 2017 20:15 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: అక్రమాలకు, తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడిన కళంకిత కంపెనీలను ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణలో పాల్గొనడాన్ని ప్రభుత్వం నిషేధించనుంది. కేంద్రం తాజాగా జారీ చేసిన నూతన డిజిన్వెస్ట్‌మెంట్‌ మార్గదర్శకాల్లో ఈ మేరకు స్పష్టం చేసింది. అవకతవకలకు పాల్పడటం, నిబంధనల ఉల్లంఘనలపై న్యాయస్థానం నుంచి ప్రతికూల తీర్పులు ఎదుర్కొన్న కంపెనీలు, రెగ్యులేటరీ యంత్రాంగాలు, మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ నుంచి ప్రతికూల ఆదేశాలు అందుకున్న సంస్థలు పీఎస్‌యూ కంపెనీల డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియలో పాల్గొనేందుకు అనర్హమైనవిగా ప్రభుత్వ నోటిఫికేషన్‌ పేర్కొంది. ఇక ఏదేని కంపెనీపై సెబీ ప్రాసిక్యూషన్‌ ఉత్తర్వులు వెలువరిస్తే వాటిని న్యాయస్దానాలు నిర్దారించిన అనంతరమే ఆ బిడ్డర్‌ను అనర్హులుగా ప్రకటిస్తారని తాజా మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.

గతంలో డిజిన్వెస్ట్‌మెంట్‌కు బిడ్డర్ల ఎంపిక కోసం ఆయా కంపెనీల నికర ఆస్తులు, అనుభవాలను ప్రభుత్వం పరిశీలించేది. అయితే కేం‍ద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాను దక్కించుకునేందుకు ఆసక్తి చూపే పార్టీల అర్హత, అనర్హతలను విశ్లేషించే క్రమంలో ఇతర క్రైటిరియానూ పరిశీలించాలని తాజాగా నిర్ణయించిన క్రమంలో నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వ రంగ సంస్ధల్లో వాటాల విక్రయాన్ని పారదర్శకంగా చేపట్టేందుకు కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ ద్వారా అర్హులను ఎంపిక చేసేందుకు తాజా మార్గదర్శకాలను వెలువరించినట్టు ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ ఎసెట్‌ మేనేజ్‌మెంట్‌ పేర్కొంది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌యూల డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ15,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించింది.
 

మరిన్ని వార్తలు