మొండిబకాయిల భరతం పట్టండి...

29 Dec, 2014 00:15 IST|Sakshi
మొండిబకాయిల భరతం పట్టండి...

వసూలుకు కఠిన చర్యలు తీసుకోవాలి...
పధాని మోదీ, ఆర్థిక మంత్రి జైట్లీలకు ఏఐబీఓసీ విజ్ఞప్తి

 
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో కొండలా పేరుకుపోతున్న మొండిబకాయిల(ఎన్‌పీఏ) వసూలుకు కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని బ్యాంకింగ్ యూనియన్ కోరింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలకు రాసిన లేఖలో అఖిల భారత బ్యాంక్ ఆఫీసర్ల సమాఖ్య(ఏఐబీఓసీ) ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా సంస్కరణలపరంగా చేపట్టే ఎలాంటి చర్యలైనా బ్యాంకుల జాతీయీకరణ లక్ష్యాలను పటిష్టపరిచే విధంగానే ఉండాలని కూడా సూచించింది.

బ్యాంకుల అధిపతులతో జనవరి 2,3 తేదీల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘జ్ఞాన్ సంగం’ సమావేశం నేపథ్యంలో ఏఐబీఓసీ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీ ముగింపులో ప్రధాని మోదీ బ్యాంకర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతలను క్రిమినల్ నేరంగా పరిగణించడంతోపాటు.. ఇలాంటి రుణ ఎగవేతదారులకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ వర్తించకుండా చేయాలని ఏఐబీఓసీ తన లేఖలో పేర్కొంది. మొండిబకాయిల వసూళ్లను వేగవంతం చేయడానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టిసారించాలని సూచించింది. దేశీ బ్యాంకింగ్ రంగంలో రూ.2.5 లక్షల కోట్లను ఎన్‌పీఏలుగా ప్రకటిస్తే.. ఇందులో 65-70 శాతం బడా కార్పొరేట్ సంస్థలవేనని వివరించింది.

మరిన్ని వార్తలు