తాన్లా చేతికి కారిక్స్‌ మొబైల్‌

21 Aug, 2018 00:23 IST|Sakshi

డీల్‌ విలువ రూ.340 కోట్లు

ఇందులో రూ.112 కోట్లు నగదు

రూ.103 కోట్ల మేర రుణాల టేకోవర్‌

మిగిలిన మొత్తానికి రూ.56.79 చొప్పున షేర్లు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: క్లౌడ్‌ కమ్యూనికేషన్స్‌ కంపెనీ తాన్లా సొల్యూషన్స్‌... ముంబైకి చెందిన కారిక్స్‌ మొబైల్‌ను (గతంలో ఎమ్‌గేజ్‌ ఇండియా) ౖకైవసం చేసుకుంది. ఈ డీల్‌ ద్వారా కారిక్స్‌ అనుబంధ కంపెనీ యూనిసెల్‌ కూడా తాన్లా సొంతమవుతుంది. దీన్ని బ్లాక్‌స్టోన్‌కు చెందిన జీఎస్‌ఓ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌ నుంచి రూ.340 కోట్లకు తాన్లా కొనుగోలు చేసింది. తాజా డీల్‌తో దేశంలోని ఎంటర్‌ప్రైస్‌ క్లౌడ్‌ కమ్యూనికేషన్స్‌ రంగంలో అగ్రశ్రేణి సంస్థగా నిలుస్తామని తాన్లా సీఎండీ ఉదయ్‌ రెడ్డి వెల్లడించారు.

ఈ డీల్‌ నగదు– ఈక్విటీ రూపంలో ఉంటుంది. రూ.112 కోట్ల నగదును తమ అంతర్గత వనరుల నుంచి సమీకరించి జీఎస్‌ఓ క్యాపిటల్‌కు తాన్లా అందజేస్తుంది. ఇక కారిక్స్‌కు చెందిన రూ.103 కోట్ల రుణాన్ని కూడా తాన్లా టేకోవర్‌ చేస్తుంది. మిగిలిన రూ.125 కోట్లకు గాను ఒక్కొక్కటీ రూ.56.79 చొప్పున తన ఈక్విటీ షేర్లను జారీ చేస్తుంది. కారిక్స్‌ మొబైల్‌ తమకు వ్యూహాత్మకంగా చక్కగా పనికొస్తుందని, అధిక బిల్లింగ్‌ చేసే కస్టమర్లు, డైవర్సిఫికేషన్‌ సాధ్యమవుతాయని, సమర్థులైన టెక్నోక్రాట్లు కూడా తమకు జతవుతారని ఉదయ్‌ రెడ్డి వివరించారు.

18 ఏళ్లుగా మొబైల్‌ ఎంగేజ్‌మెంట్, కమ్యూనికేషన్‌ సేవలందిస్తున్న కారిక్స్‌కు దేశంలోని నాలుగు నగరాల్లో కార్యాలయాలతో పాటు బీఎఫ్‌ఎస్‌ఐ, డీటీహెచ్, ప్రభుత్వ, ఆటో, రిటైల్, ఎఫ్‌ఎంసీజీ,ఈ–కామర్స్‌ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా 1,500 కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. 2017–18లో రూ.540 కోట్ల టర్నోవర్‌ నమోదు చేసింది. 250 మంది ఉద్యోగులున్నారు.  

మరిన్ని వార్తలు