వాహన దిగుమతులపైనా టారిఫ్‌లు!

25 May, 2018 00:58 IST|Sakshi

జాతి భద్రత కోణంలో విచారణకు ట్రంప్‌ ఆదేశాలు

వాషింగ్టన్‌: అమెరికాలోకి దిగుమతి అవుతున్న వాహనాలు, ట్రక్కులు, ఆటో ఉపకరణాల వల్ల జాతీయ భద్రతకు విఘాతం కలుగుతుందా? అన్న కోణంలో విచారణ జరపాలని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశారు. తాజా చర్యతో అమెరికా భద్రత, ప్రయోజనాల కోణంలో దిగుమతి అయ్యే వాహనాలు, వాహనోత్పత్తులపై పెద్ద ఎత్తున టారిఫ్‌లు విధించే అవకాశం కనిపిస్తోంది. 1962 వాణిజ్య విస్తరణ చట్టంలోని (టీఈఏ) సెక్షన్‌ 232 కింద విచారణ ప్రారంభించే అంశాన్ని పరిశీలించాలని తనను కలసిన వాణిజ్య మంత్రి విల్బర్‌ రాస్‌కు ట్రంప్‌ సూచించారు. దిగుమతి అయ్యే కార్లపై టారిఫ్‌లు లేదా నియంత్రణలు విధించాల్సిన అవసరం ఉందా? అన్నది పరిశీలించాలని కోరారు. ప్రధాన పరిశ్రమ అయిన ఆటోమొబైల్స్, ఆటోమోటివ్‌ పార్ట్‌లు తమ దేశ బలమని ట్రంప్‌ అభివర్ణించారు. అమెరికా ఈ ఏడాది మార్చిలో ఇదే విధంగా... దిగుమతి అయ్యే స్టీల్‌పై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం టారిఫ్‌లు విధించిన విషయం గమనార్హం. 22 శాతం ఉద్యోగాలకు గండి‘‘గడిచిన 20 ఏళ్లలో అమెరికా కార్ల విక్రయాల్లో దిగుమతి అయ్యే ప్రయాణికుల వాహనాల వాటా 32 శాతం నుంచి 48 శాతానికి పెరిగింది. అమెరికన్లు రికార్డు స్థాయిలో కార్లను కొనుగోలు చేస్తున్నాగానీ 1990 నుంచి 2017 వరకు వాహనోత్పత్తి రంగంలో ఉద్యోగాలు 22 శాతం తగ్గాయి’’ అని అమెరికా వాణిజ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. 

గట్టిగా ఎదుర్కొంటాం: చైనా 
తమ హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించుకుంటామని చైనా వాణిజ్య శాఖ స్పష్టం చేసింది. అమెరికా నిర్ణయాలు బహుపాక్షిక వాణిజ్య విధానాన్ని బలహీనపరచడమేనని, అంతర్జాతీయ వాణిజ్యానికి విఘాతం కలిగించే చర్యలను అమెరికా తీసుకుంటోందని చైనా వాణిజ్య శాఖా ప్రతినిధి గావో ఫెంగ్‌ బీజింగ్‌లో మీడియాతో పేర్కొన్నారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా