ఈ–కామర్స్‌పై టాస్క్‌ఫోర్స్‌: కేంద్రం

25 Apr, 2018 00:43 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ రంగానికి సంబంధించి ప్రత్యేక విధానం రూపకల్పనపై కేంద్రం దృష్టి సారించింది. ఇందుకోసం టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ–కామర్స్‌పై జాతీయ విధానం రూపకల్పనపై ఏర్పాటైన కమిటీ మంగళవారం తొలిసారి సమావేశమైన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది.

ట్యాక్సేషన్, ఇన్‌ఫ్రా, పెట్టుబడులు, టెక్నాలజీ బదలాయింపు, డేటా భద్రత, నిబంధనలు, పోటీ మొదలైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రీటా తియోతియా తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌ తమ సిఫార్సులను అయిదు నెలల్లోగా కమిటీకి సమర్పించాల్సి ఉంటుందని, కమిటీ ఆరు నెలల్లో నివేదికనివ్వాల్సి ఉంటుందని ఆమె తెలియజేశారు.

డైరెక్ట్‌ సెల్లర్లకు ఆన్‌లైన్‌ సెగ!: ఐడీఎస్‌ఏ
డైరెక్ట్‌ సెల్లర్ల వ్యాపారంపై  ఆన్‌లైన్‌ డిస్కౌంట్లు ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్, షాప్‌క్లూస్‌ వంటి ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌లో డైరెక్ట్‌ సెల్లర్ల అనుమతి లేకుండానే వారికి సంబంధించిన ఉత్పత్తులు అధిక డిస్కౌంట్‌ ధరలకు లభిస్తున్నాయి. దీంతో వారి వ్యాపారంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ విషయాలు ఇండియా డైరెక్ట్‌ సెల్లింగ్‌ అసోసియేషన్‌ (ఐడీఎస్‌ఏ) 2016–17 వార్షిక నివేదికలో వెల్లడయ్యాయి.

మరిన్ని వార్తలు