మార్కెట్లోకి టాటా ఆల్ట్రోజ్‌

23 Jan, 2020 06:24 IST|Sakshi

ధరలు రూ. 5.29–9.29 లక్షల రేంజ్‌లో

తొలి డీజిల్‌ బీఎస్‌–6 కారు

ముంబై: టాటా మోటార్స్‌ ప్రీమియమ్‌ హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్లోకి ప్రవేశించింది.  ఆల్ట్రోజ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారులో ఐదు పెట్రోల్, ఐదు డీజిల్‌ వేరియంట్లను అందిస్తున్నామని టాటా మోటార్స్‌  సీఈఓ, ఎమ్‌డీ గుంటర్‌ బషెక్‌ చెప్పారు. పెట్రోల్‌ వేరియంట్ల ధరలు రూ.5.29–7.69 లక్షలు... డీజిల్‌ వేరియంట్ల ధరలు రూ.6.99–9.29 లక్షల రేంజ్‌లో ఉన్నాయని తెలిపారు. ఇది భారత్‌లో తొలి బీఎస్‌–6 డీజిల్‌ కారని పేర్కొన్నారు. ఆల్ఫా ప్లాట్‌ఫార్మ్‌పై తామందిస్తున్న తొలి వాహనం కూడా ఇదేనని వివరించారు. ఆల్ట్రోజ్‌తో పాటు నెక్సాన్, టియగో, టైగోర్‌ మోడళ్లలో బీఎస్‌ సిక్స్‌ వేరియంట్లను కూడా మార్కెట్లోకి విడుదల చేశామన్నారు.  
 

ఫీచర్లు...: ఈ కారులో క్రూయిజ్‌ కంట్రోల్, 7 అంగుళాల టీఎఫ్‌టీ డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్, 7 అంగుళాల ఫ్లోటింగ్‌ టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్, రివర్స్‌ పార్కింగ్‌ సెన్సర్లు, తదితర ఫీచర్లున్నాయి. డ్యుయల్‌ ఫ్రంట్‌ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్‌ విత్‌ ఈబీడీ, రివర్స్‌ పార్కింగ్‌ సెన్సర్స్, హై స్పీడ్‌ అలర్ట్‌ సిస్టమ్‌ తదితర భద్రతా ఫీచర్లున్నాయి. కాగా, మారుతీ సుజుకీ బాలెనో, హ్యుందాయ్‌ ఎలీట్‌ ఐ20, హోండా జాజ్, టయోటా గ్లాంజా, ఫోక్స్‌వ్యాగన్‌ పోలోలకు ఈ ఆల్ట్రోజ్‌ కారు గట్టి పోటీనిస్తుందని పరిశ్రమల వర్గాల అంచనా.

మరిన్ని వార్తలు