టాటా మోటార్స్ నుంచి బోల్ట్ కారు

23 Jan, 2015 09:04 IST|Sakshi
టాటా మోటార్స్ నుంచి బోల్ట్ కారు

ముంబై: టాటా మోటార్స్ కంపెనీ ప్రీమియం హ్యాచ్‌బాక్ కేటగిరీలో  కొత్త మోడల్, బోల్ట్‌ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారును పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో అందిస్తున్నామని టాటా మోటార్స్ ప్యాసింజర్ కార్ డివిజన్ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ చెప్పారు. కోల్పోయిన మార్కెట్ వాటా సాధించడంలో భాగంగా కంపెనీ తెస్తున్న రెండో కొత్త మోడల్ ఇది. గత ఏడాది ఆగస్టులో సెడాన్ మోడల్, జెస్ట్‌ను టాటా మోటార్స్ విడుదలచేసింది.
 
తొలి మల్టీడ్రైవ్ ఆప్షన్ కారు: హొరైజనెక్స్‌ట్ క్యాంపెయిన్‌లో భాగంగా టాటా మోటార్స్  తెస్తోన్న కారు ఇది. మొత్తం నాలుగు పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఈ కారు లభ్యం. త్వరలో బోల్ట్ ఆటోమాటిక్ వేరియంట్‌ను కంపెనీ  అందిస్తుందని సమాచారం. బోల్ట్ కారుకు 1,500కు పైగా ముందస్తు బుకింగ్‌లు వచ్చాయని పరీక్ చెప్పారు. గురువారం నుంచే దేశవ్యాప్తంగా ఉన్న 450 డీలర్ల వద్ద ఈ కారును విక్రయానికి అందుబాటులో ఉంచామని వివరించారు. భారత్‌లో తొలి మల్టీ డ్రైవ్ ఆప్షన్ ఉన్న కారు ఇదని వివరించారు. స్పోర్టింగ్, ఫ్యూయల్ ఎఫిషీయంట్, సిటీ మోడ్..వంటి డ్రైవింగ్ సెలెక్ట్ ఆప్షన్‌లు ఉన్నాయని వివరించారు.
 
కారు ప్రత్యేకతలు: ఈ కారులో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, స్మోక్‌డ్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, నైన్త్ జనరేషన్ ఏబీఎస్ మెకానిజమ్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, కనెక్ట్ నెక్స్‌ట్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వాయిస్ కమాండ్ రికగ్నిషన్ సిస్టమ్, టచ్ స్క్రీన్ కంట్రోల్స్ ఉన్న పూర్తి ఆటోమాటిక్ ఏసీ యూనిట్ వంటి ప్రత్యేకతలున్నాయి. పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.4.65 లక్షల నుంచి,  డీజిల్ వేరియంట్ ధరలు రూ.5.75 లక్షల (ఎక్స్ షోరూమ్, ముంబై)నుంచి ప్రారంభమవుతాయని పరీక్ చెప్పారు. పెట్రోల్ కారు 15.6 కిమీ. డీజిల్ కారు 22.9 కిమీ. మైలేజీని ఇస్తాయని వివరించారు.
 
కొత్త నానో: అంతంత మాత్రం అమ్మకాలతో నడుస్తున్న నానో కారును సరికొత్తగా తీర్చిదిద్దాలని టాటా మోటార్స్ యోచిస్తోంది. పెలికాన్ కోడ్ నేమ్‌తో కొత్త కారును గుజరాత్‌లోని సాణంద్ ప్లాంట్‌లో అభివృద్ధి చేస్తోందని సమాచారం.

మరిన్ని వార్తలు