నియోటెల్కు ‘టాటా’..

29 Jun, 2016 00:29 IST|Sakshi
నియోటెల్కు ‘టాటా’..

డీల్ విలువ రూ.2,900 కోట్లు
టాటా కమ్యూనికేషన్స్‌కు రూ.1,992 కోట్లు

న్యూఢిల్లీ: టాటా కమ్యూనికేషన్స్ కంపెనీ తన ఆఫ్రికా అనుబంధ సంస్థ, నియోటెల్ పీటీైవె ను విక్రయించనున్నది.  ఈకోనెట్ వెర్లైస్ గ్లోబల్ అనుబంధ కంపెనీ లిక్విడ్ టెలికం, రాయల్ బాఫోకెంగ్ హోల్డింగ్స్(ఆర్‌బీహెచ్)లు  నియోటెల్ కంపెనీని రూ.2,900 కోట్లకు కొనుగోలు చేయనున్నాయి. ఈ మేరకు నియోటెల్‌లో మెజారిటీ వాటా ఉన్న టాటా టెలికమ్యూనికేషన్స్‌తోనూ, మైనారిటీ వాటాదారులకు నాయకత్వం వహిస్తున్న నెక్సస్ కనెక్సియన్‌తోనూ లిక్విడ్ టెలికం, ఆర్‌బీహెచ్‌లు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా టాటా కమ్యూనికేషన్స్‌కు రూ.1,992 కోట్లు. నెక్సస్ కనెక్సియన్ నేతృత్వంలోని మైనారిటీ వాటాదారులకు రూ.908 కోట్లు లభిస్తాయి. ఈ వాటా కొనుగోలు తర్వాత దక్షిణాఫ్రికాకు చెందిన ఎంపవర్‌మెంట్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ అయిన ఆర్‌బీహెచ్‌కు  నియోటెల్‌లో 30 శాతం వాటా ఉంటుంది.

 లిక్విడ్ టెలికం సరైన భాగస్వామి..
నియోటెల్ తర్వాతి దశ వృద్ధికి లిక్విడ్ టెలికం సరైన భాగస్వామి అని టాటా కమ్యూనికేషన్స్ ఎండీ,సీఈఓ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ డీల్ పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ డీల్ అన్ని ఆమోదాలు పొంది సాకారమైతే, దక్షిణాఫ్రికాలో అతి పెద్ద బ్రాడ్‌బాండ్ నెట్‌వర్క్, బీ2బీ టెలికం ప్రొవైడర్ నియోటెల్ అవుతుంది. 2009లో నియోటెల్‌లో 68.5ు వాటాను టాటా కమ్యూనికేషన్స్ కొనుగోలు చేసింది. ఈ డీల్ నేపథ్యంలో కంపెనీ షేర్ బీఎస్‌ఈలో 8% లాభంతో రూ.486కు ఎగసింది. చివరకు 2.4%లాభంతో రూ.461 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు