జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌లో తగ్గనున్న టాటా వాటా

31 Oct, 2019 04:58 IST|Sakshi

19.7 నుంచి 14.7 శాతానికి చేరిక

నియంత్రణల నేపథ్యంలో తాజా నిర్ణయం

నిర్వహణ జీఎంఆర్‌ చేతిలోనే

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌లో టాటా గ్రూప్‌ ప్రతిపాదిత వాటా కొనుగోలు డీల్‌ను పునర్‌వ్యవస్థీకరించినట్టు సమాచారం. నియంత్రణ పరమైన అంశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో టాటా గ్రూప్‌ నేతృత్వంలోని మూడు సంస్థలు జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌లో 44.4 శాతం వాటాను రూ.8,500 కోట్లకు కొనుగోలు చేసేందుకు జీఎంఆర్‌తో డీల్‌ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

వాస్తవ ప్రణాళిక ప్రకారం జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌లో టాటా గ్రూప్‌ 19.7%, సింగపూర్‌ సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌ జీఐసీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 14.8%, హాంకాంగ్‌కు చెందిన ఎస్‌ఎస్‌జీ క్యాపిటల్‌ 9.9% వాటాను దక్కించుకోవాలి. నూతన ప్రణాళిక ప్రకారం టాటాల వాటా 14.7%కి పరిమితం కానుంది. జీఐసీ వాటా 5 శాతం పెరిగి 19.8%కి చేరనుంది. ఎస్‌ఎస్‌జీ వాటాలో ఎటువంటి మార్పు లేకుండా 9.9% ఉండనుంది. ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ అనుబంధ కంపెనీ అయిన ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌లో టాటా గ్రూప్‌ వాటా డీల్‌ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత నికరంగా 10 శాతానికి చేరుతుంది.  

ఇదీ నేపథ్యం..: జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌లో టాటా గ్రూప్‌ వాటా కొనుగోలు విషయమై న్యాయపర అంశాలపై ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కొద్ది రోజుల క్రితం  సొలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అభిప్రాయాన్ని కోరింది. ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటింగ్‌ కంపెనీల్లో దేశీయ ఎయిర్‌లైన్‌ సంస్థల వాటా 10 శాతంలోపే ఉండాలన్న పరిమితి ఉంది. టాటా గ్రూప్‌.. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ భాగస్వామ్యంతో పూర్తిస్థాయి సర్వీస్‌ క్యారియర్‌ ‘విస్తారా ఎయిర్‌లైన్స్‌’, మలేషియాకు చెందిన ఎయిర్‌ ఆసియా బెర్హడ్‌తో కలిసి బడ్జెట్‌ ఎయిర్‌లైన్‌ ‘ఎయిర్‌ఆసియా ఇండియా’ను నిర్వహిస్తోంది. ఈ రెండు సంస్థల్లోనూ టాటా గ్రూప్‌నకు 51 శాతం వాటా ఉంది. కాగా, డీల్‌ తదనంతరం జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌లో జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, దాని అనుబంధ సంస్థల వాటా 53.5 శాతంగా ఉంటుంది. కంపెనీ ఎంప్లాయీ వెల్ఫేర్‌ ట్రస్ట్‌కు 2.1 శాతం వాటా ఉంది. ఎయిర్‌పోర్టుల నిర్వహణ బాధ్యత జీఎంఆర్‌ చేతిలోనే ఉండనుంది. డీల్‌తో జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రుణం రూ.12,000 కోట్లకు వచ్చి చేరుతుంది.

మరిన్ని వార్తలు