మిస్త్రీ కంపెనీలకు పూర్తిగా ’టాటా’

18 Aug, 2017 00:07 IST|Sakshi
మిస్త్రీ కంపెనీలకు పూర్తిగా ’టాటా’

న్యూఢిల్లీ: మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీకి చెందిన షాపూర్‌జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్‌తో వ్యాపార లావాదేవీలు పూర్తిగా తెగదెంపులు చేసుకోవడంపై టాటా గ్రూప్‌ దృష్టి పెట్టింది. టాటా గ్రూప్‌ ప్రమోటింగ్‌ సంస్థ టాటా సన్స్‌ ఈ మేరకు.. తమ గ్రూప్‌ సంస్థలకు ఈ నెల ప్రారంభంలో ఆదేశాలు ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

 మరోవైపు టాటా సన్స్‌ చైర్మన్‌గా మిస్త్రీ ఉన్న రోజుల్లోనే టాటా కంపెనీల నుంచి తమకొచ్చే ఇంజనీరింగ్, నిర్మాణ కాంట్రాక్టులు సున్నా స్థాయికి పడిపోయాయని, ఒకవేళ ఒకటీ అరా ఉన్నా అవి పెద్దగా ప్రాధాన్యం లేనివేనని షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌ పేర్కొంది. 2013 నవంబర్‌లో టాటా సన్స్‌కి చైర్మన్‌గా ఉన్నప్పుడే తన పదవీ కాలంలో ఎస్‌పీ గ్రూప్‌నకు కొత్తగా ఎటువంటి ఇంజనీరింగ్, నిర్మాణ కాంట్రాక్టులు ఇవ్వరాదంటూ మిస్త్రీ స్వయంగా ఆదేశాలు జారీ చేసినట్లు వివరించింది.

 ఈ నేపథ్యంలోనే టాటా గ్రూప్‌ నుంచి 2012–13లో రూ. 1,125 కోట్లుగా ఉన్న ఆర్డర్ల పరిమాణం 2015–16 నాటికల్లా సున్నా స్థాయికి తగ్గిపోయాయని ఎస్‌పీ గ్రూప్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. మిస్త్రీకి ఉద్వాసన పలికిన అనంతరం రెండు గ్రూప్‌ల మధ్య మొదలైన వైరానికి ఇది కొనసాగింపుగా పరిశీలకులు అభిప్రాయపడ్డారు. 18.4 శాతం వాటాలతో టాటా సన్స్‌లో ఎస్‌పీ గ్రూప్‌ అతి పెద్ద వాటాదారుగా ఉంది.

మరిన్ని వార్తలు