ఈ ‘మహారాజా’ను భరించలేం!!

12 Apr, 2018 00:36 IST|Sakshi

ఎయిరిండియాను కొనేవారే కరువు

బిడ్డింగ్‌ ప్రక్రియకు దూరంగా కంపెనీలు

టాటా గ్రూప్‌ సైతం విముఖత

కొనుగోలుకు పెట్టిన షరతులే కారణం!

న్యూఢిల్లీ: ఒకప్పుడు మహారాజాలా వెలుగొందిన ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియాను దక్కించుకునేందుకు కంపెనీలు పోటీపడతాయనుకుంటే అందుకు విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎయిరిండియాను కొనేందుకు గతంలో ఆసక్తి చూపించిన కంపెనీలు కూడా ఒక్కొక్కటిగా పక్కకి తప్పుకుంటున్నాయి. ఇండిగో, జెట్‌ ఎయిర్‌వేస్‌ ఇప్పటికే వైదొలగగా.. కచ్చితంగా రేసులో ఉంటుందనుకున్న టాటా గ్రూప్‌ సైతం ఈ డీల్‌పై అంతగా ఆసక్తిగా లేనట్లుగా తెలిసింది. విక్రయ ప్రతిపాదనలో పొందుపరచిన షరతులే కంపెనీల అనాసక్తికి కారణంగా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. టాటా గ్రూప్‌నకు ఇప్పటికే ఎయిర్‌ ఏసియా, విస్తారా సంస్థల్లో వాటాలున్నాయి. అయితే, జేఆర్‌డీ టాటా పునాదులు వేసిన ఎయిరిండియాను మళ్లీ సొంతం చేసుకోవాలని కంపెనీ భావిస్తోంది. టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ ఎయిరిండియా ప్రైవేటీకరణ ప్రక్రియ ఖరారైన పక్షంలో తాము కచ్చితంగా బిడ్‌ వేస్తామని గతంలో చెప్పారు కూడా. అయితే, బిడ్డింగ్‌ నిబంధనలన్నీ వెల్లడయ్యాక టాటా గ్రూప్‌ కూడా పునరాలోచనలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. 

అటు గల్ఫ్‌ దేశాల విమానయాన సంస్థలు ఎమిరేట్స్, ఖతార్‌ ఎయిర్‌వేస్‌ పీజేఎస్‌సీ కూడా ఎయిరిండియా బిడ్డింగ్‌ నుంచి తప్పుకున్నాయి. ఏ విమానయాన సంస్థనూ కొనే యోచన తమకు లేదని ఎమిరేట్స్‌ వెల్లడించింది. మరోవైపు ఎయిరిండియా కొనుగోలుకు సంబంధించి ఎలాంటి చర్చల్లో తాము పాలుపంచుకోవడం లేదని ఖతార్‌ ఎయిర్‌వేస్‌ స్పష్టం చేసింది. ఇక, స్పైస్‌జెట్‌ ఒక్కటే మిగిలినప్పటికీ.. ఎయిరిండియాను కొనేంత స్తోమత తమకు లేదంటూ కొన్నాళ్ల క్రితమే ఆ సంస్థ చైర్మన్‌ అజయ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. గల్ఫ్‌ దేశాలతో పాటు వివిధ దేశాలతో ప్రయోజనకరమైన ఒప్పందాలున్న ఎయిరిండియాను కొనుక్కుంటే కొన్ని యూరోపియన్, అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కి ఉపయోగకరంగానే ఉంటుందని ఏవియేషన్‌ కన్సల్టింగ్‌ సంస్థ మార్టిన్‌ కన్సల్టింగ్‌ సీఈవో మార్క్‌ అభిప్రాయపడ్డారు. కానీ ప్రస్తుతం చమురు రేట్లు పెరుగుతుండటంతో యూరోపియన్‌ ఎయిర్‌లైన్స్‌ నిర్వహణ వ్యయాలను తగ్గించుకునే పనిలో ఉండగా.. అమెరికా సంస్థలు తమ సొంత మార్కెట్‌పైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయని ఆయన చెప్పారు. 

షరతులే కారణం..
నష్టాలు, రుణభారంతో కుంగుతున్న ఎయిరిండియాలో 76 శాతం వాటాలు విక్రయించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు ఖరారు చేసింది. అయితే, కొనుక్కున్న బిడ్డరు.. ప్రభుత్వ వాటాలు కొనసాగినంత వరకూ ఎయిరిండియాను మరే ఇతర వ్యాపారాల్లో విలీనం చేయరాదని, కంపెనీని స్టాక్‌ ఎక్సే్చంజీల్లో లిస్ట్‌ చేయాలని, ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించాలని షరతులు పెట్టింది. దీంతో ఎయిరిండియాను కొనుక్కున్నా భారీగా ఉన్న సిబ్బందిని తగ్గించుకునే వీలుండదు. ఈ వివరాలన్నీ వెల్లడయ్యాక... అప్పటిదాకా ఆసక్తి చూపించిన  కంపెనీలు కూడా వెనక్కి తగ్గాయని తెలియవచ్చింది. ఇలాంటి షరతులతో డీల్‌ ఎలా సాధ్యపడుతుందంటూ టాటా గ్రూప్‌ కూడా పునరాలోచనలో పడినట్లు సమాచారం. పైపెచ్చు అంత భారీ రుణభారం ఉన్న సంస్థను బోలెడు డబ్బు పోసి కొంటున్నప్పుడు పూర్తి స్థాయిలో తమకు అధికారాలు ఉండాలని కొనుగోలుదారు కోరుకుంటారని, అందుకు విరుద్ధంగా ఉంటే ముందుకెవరొస్తారని సంబంధిత వర్గాలు వ్యాఖ్యానించాయి.

చౌకగా కొనేసేందుకే: ఎయిరిండియా ఉద్యోగులు
ఎయిరిండియా కొనుగోలుకు షరతుల కారణంతో కంపెనీలు ఒక్కొక్కటిగా తప్పుకుంటుండటంపై సంస్థ ఉద్యోగులు స్పందించారు. ఎయిరిండియాను చౌకగా అమ్మేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవటానికే కంపెనీలు ఇవన్నీ చేస్తున్నాయని ఎయిరిండియాకు చెందిన పది యూనియన్ల ఫోరం ఒక ప్రకటనలో ఆరోపించింది. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం, పౌర విమానయాన శాఖ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొంది. అయితే, తాము ఇప్పటికీ ఎయిరిండియా ప్రైవేటీకరణకు వ్యతిరేకమేనని యూనియన్లు స్పష్టం చేశాయి. ‘కొనుగోలుకు ఆసక్తిగా ఉన్నామని చెబుతున్న సంస్థలన్నీ నిబంధనలన్నీ తమకు అనుకూలంగా మార్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. కంపెనీని చౌకగా కొనేయాలని చూస్తున్నాయి‘ అని ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. మరోవైపు, ఎయిరిండియా నిర్వహణ, ఆర్థిక పనితీరు మెరుగుపడుతున్న దశలో కంపెనీని ప్రైవేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం చూస్తోందని ఫోరం ఆరోపించింది. 

నిబంధనలు  సడలించక తప్పదు:  పరిశ్రమ వర్గాలు 
ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు ఎవరైనా ముందుకు రావాలంటే ప్రభుత్వం నిబంధనలను సడలించాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. షరతులను పునఃసమీక్షించడంతో పాటు కంపెనీ రుణభారం, ఉద్యోగుల విషయంపై మరింత స్పష్టతనివ్వాల్సి ఉంటుందని తెలిపాయి. డీల్‌ స్వరూపాన్ని సరళం చేస్తే 3–4 సంస్థలు కచ్చితంగా ముందుకు రావొచ్చని, దీంతో అంతిమంగా ప్రభుత్వానికి ప్రయోజనం చేకూరగలదని కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ పార్ట్‌నర్‌ అంబర్‌ దూబే పేర్కొన్నారు. అయితే, ఎయిరిండియా అమ్మకం డీల్‌లో కీలక షరతులు, నిబంధనల్లో ప్రభుత్వం ఎటువంటి మార్పులు చేయకపోవచ్చని పౌర విమానయాన శాఖ వర్గాలు తెలిపాయి. ఏది ఏమైనా ప్రభుత్వం అనుకుంటున్నట్లుగా ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరునాటికి ఎయిరిండియా అమ్మకం జరగకపోవచ్చని, ఇంత సంక్లిష్టమైన డీల్‌ పూర్తి కావడానికి కనీసం రెండేళ్లయినా పట్టేస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.     

మరిన్ని వార్తలు