‘టాటా ఇండికా’కు ఇక టాటా!

23 May, 2018 11:07 IST|Sakshi
టాటా గ్రూపు ఛైర్మన్‌ రతన్‌ టాటా (పాత చిత్రం)

సాక్షి, న్యూఢిల్లీ:   చిన్న కార్లను ఇష్టపడే మధ్య తరగతి ప్రజల ఆశలపై టాటామోటార్స్‌ నీళ్లు  చల్లింది.  తాజా సమాచారం ప్రకారం టాటా ఇండికా, టాటా ఇండిగో కార్ల ఉత్పత్తిని  నిలిపివేసింది. తద్వారా 20 సంవత్సరాలనుంచి టాటామోటార్స్‌ ప్రముఖ కారుగా నిలిచిన ఇండికా  ఇక కనమరుగుకానుందన్నమాట. టాటా ఇండికా,  ఇండిగో సెడాన్ల ఉత్పత్తిని శాశ్వతంగా నిలిపివేసింది. ఈ ఆర్థిక సంవత్సరం 2018-19 ప్రారంభంనుంచి  ఇండికా,  ఇండిగో సెడాన్‌కు సంబంధించి  ఒక్క యూనిట్‌ను కూడా ఉత్పత్తి చేయలేదు.  పరిశ్రమల బాడీ సియామ్‌  గణాంకాలు ఈ సమాచారాన్ని నిర్ధారిస్తున్నాయి.

ఇంపాక్ట్‌ డిజైన్ కార్ల విజయాన్ని ఆస్వాదిస్తున్న టాటా  మోటార్స్‌ కంపెనీ పాత డిజైన్‌, తక్కువ సేల్స్‌ ఉన్న  ఇండికా,  ఇండిగోలను పూర్తిగా పక్కన పెట్టేసిందని పరిశ్రమ వర్గాలు విశ్వసిస్తున్నాయి.  ఈ క్రమంలోనే 2017-18 ఆర్థిక సంవత్సరానికి టాటా మోటర్స్ 1,666 యూనిట్ల ఇండికా కార్లను,  556 యూనిట్ల ఇండిగో సిఎస్ సెడాన్లు  ఉత్పత్తి చేసింది. అనంతరం క్రమంగా  ఈ కార్ల ఉత్పత్తిని  పూర్తిగా నిలిపివేసింది. దీనిపై టాటా మోటార్స్ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ..  కార్ల  సెగ్మెంట్‌లో మారుతున్న మార్కెట్ డైనమిక్స్,  రూపకల్పనకు సంబంధించి కొత్త టెక్నాలజీ  నేపథ్యంలో ఇండికా, ఇండిగో ఇసిఎస్‌లను క్రమంగా ఫేజ్‌​ అవుట్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.  ప్రస్తుత ఉద్గార నిబంధనలు, బీఎస్‌-6 నిబంధనల  నేపథ్యంలో వాహనాలను బీఎస్‌-6కు అప్‌గ్రేడ్‌ చేయాల్సి ఉంది. ఇందుకు భారీ పెట్టుబడులు అవసరమని టాటా మోటార్స్‌ భావిస్తోంది.  అలాగే 2020 నాటికి భారతదేశంలో ఒక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ కారును విడుదల చేయాలని కంపెనీ  యోచిస్తోంది.

కాగా 1998 లో జెనీవా మోటార్ షోలో ప్రదర్శించిన  టాటా ఇండికా భారతీయ మార్కెట్లో ఒక ఐకానిక్‌ మోడల్‌ అని చెప్పాలి.  మొట్టమొదటి స్వదేశీ కారుగా  ‘మోర్‌ కార్‌ పెర్‌ కార్‌’ అనే టాగ్‌లైన్‌’తో  లాంచ్‌ అయిన ఒక వారంలోనే   1.15 లక్షల బుకింగ్స్‌ను పొందింది.  కేవలం రెండు సంవత్సరాలలో సెగ్మెంట్ లీడర్‌గా అవతరించింది. మరోవైపు టాటా ఇండికా, టాటా ఇండిగో తర్వాత టాటా కాంపాక్ట్‌ కారు నానో  నిర్మాణాన్ని కూడా త్వరలోనే నిలిపివేయనుందని  పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఏప్రిల్ నెలలో, కంపెనీ కేవలం 45 యూనిట్ల నానో కార్లను  మాత్రమే తయారు చేసిందని పేర్కొన్నారు. అయితే, టాటా నానో  ఈ వెహికల్‌గా అప్‌గ్రేడ్‌ అయ్యే అవకాశం వుందని భావించారు. అంతేకాదు టాటా మోటర్స్ మాత్రమే కాకుండా  మహీంద్ర లాంటి  ఇతర కంపెనీలు కూడా  తమ ఉత్పత్తులలో  కొన్నింటిని  నిలిపివేయనున్నాయని విశ్లేషించారు.

మరిన్ని వార్తలు